అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాట్లాడుతూ.. ఈ స్కీంను వెనక్కి తీసుకునే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. కొన్నేళ్ల తరబడి సాగిన మేధోమథనం ద్వారా ఈ స్కీం రూపుదాల్చిందని వివరించారు. 

న్యూఢిల్లీ: అగ్నిపథ్ స్కీంపై జాతీయ బద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పందించారు. అగ్నిపథ్ స్కీంను ఉపసంహరించుకునే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. సైనిక వ్యవస్థలో యువత, టెక్ సావీలను పెంచుకునే అవసరం ఉన్నదని, అది ఈ స్కీం ద్వారా సాధ్యం అవుతుందని వివరించారు. ప్రపంచంలోనే యువత అత్యధికంగా గల దేశం భారత్ అని, కానీ, ఆర్మీలో అదే విధంగా యంగ్‌నెస్ కంటిన్యూ చేయలేకపోయిందని అన్నారు.

అయితే, ఈ స్కీం గురించిన పలు సందేహాలు, ప్రశ్నలకూ ఆయన సమాధానాలు ఇచ్చారు. సైన్యం మొత్తం ఎప్పటికీ అగ్నివీర్లతో నిండిపోదని చెప్పారు. అలాగే, అగ్నివీర్ల భవిష్యత్‌పైనా ఆందోళనలు వలదని అన్నారు. వారి భవిష్యత్ బాగుంటుందని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో నిరసనను తెలియజేసే హక్కు ఉంటుందని, కానీ, విధ్వంసం, హింసకు తావు లేదని అన్నారు. కాబట్టి, అగ్నిపథ్ స్కీం పై వ్యతిరేకతతో జరుగుతున్న విధ్వంసం, హింసను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని వివరించారు. అగ్నిపథ్ స్కీం వెనుక కొన్ని కుట్రపూరిత శక్తులు ఉన్నాయని ఆరోపించారు. సమాజంలో అశాంతి రగలాలనే కుత్సిత ఆలోచనలతో కొందరు ఉన్నారనే, వారి అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా యువతను ఎగదోస్తున్నారని అన్నారు. 

అయితే, ఈ హింసకు సంబంధించి పలు చోట్ల ఎఫ్ఐఆర్‌లు నమోదు అయ్యాయని, ఆ కేసులో దర్యాప్తు జరిపిన తర్వాత హింస వెనుక ఉన్న శక్తులు తెలియవస్తాయని పేర్కొన్నారు. అలాగే, యువతకు సందేశాన్ని ఇస్తూ.. ముఖ్యంగా అగ్నివీర్ కావాలని భావిస్తున్న యువతను ఉద్దేశిస్తూ.. పాజిటివ్ ఆలోచనలను కలిగి ఉండాలని తెలిపారు. దేశంపై నమ్మకం పెట్టాలని, దేశ నాయకత్వాన్ని నమ్మాలని సూచించారు. అలాగే, స్వీయ విశ్వాసం కూడా అవసరం అని పేర్కొన్నారు.