కర్ణాటక సీఎం హెచ్ డీ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్నిపథ్ స్కీం.. ఆరెస్సెస్ సీక్రెట్ ఎజెండా అని ఆరోపించారు. ఈ స్కీం ద్వారా ఆరెస్సెస్ కార్యకర్తలను ఆర్మీలోకి తోలుతారని, బయట కూడా విస్తృతం చేస్తారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆర్మీని తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటుందని ఆరోపించారు. అనంతరం, దేశంలో నాజీ ఉద్యమానికి తెర తీసే ఆలోచనల్లో ఉండొచ్చని అన్నారు. 

బెంగళూరు: ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో భారీ మార్పులతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అగ్నిపథ్ స్కీం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్కీంపై దేశవ్యాప్తంగా ఆర్మీ ఉద్యోగాల కోసం సిద్ధం అవుతున్న యువత భగ్గుమన్నది. హింసాత్మక ఆందోళనలు ఒకవైపు.. రాజకీయ దుమారం మరో వైపు జరుగుతున్నది. తాజాగా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్నిపథ్ స్కీం అనేది ఆరెస్సెస్ హిడెన్ అజెండా అని ఆరోపించారు. ఈ స్కీం ద్వారా ఆరెస్సె వర్కర్లను ఆర్మీలో చేరుస్తారని, ఆ తర్వాత ఆర్మీనే మొత్తంగా టేకోవర్ చేసుకుంటారని పేర్కొన్నారు. ఆ తర్వాత మన దేశంలోనూ నాజీ ఉద్యమాన్ని ప్రారంభిస్తారని ఆరోపణలు చేశారు. మన దేశంలో నాజీ ఉద్యమాన్ని ప్రారంభించడానికే ఆరెస్సెస్ అగ్నిపథ్ స్కీంను ముందుకు తెచ్చినట్టు తనకు అనుమానాలు ఉన్నాయని ఆయన రాజకీయ దుమారానికి తెరలేపారు.

అగ్నిపథ్ స్కీం.. ఒక ఆరెస్సెస్ ఎజెండా అని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి ఆరోపించారు. ఇప్పుడు 10 లక్షల మందిని అగ్నిపథ్ స్కీం ద్వారా ఆర్మీలోకి రిక్రూట్ చేసుకుంటారని, అందులో సుమారు 2.5 లక్షల మందిని ఆర్మీలో నాలుగేళ్ల తర్వాత కూడా తీసుకోవచ్చని వివరించారు. వీరంతా ఆరెస్సెస్ కార్యకర్తలు అయి ఉండొచ్చని పేర్కొన్నారు. అంతేకాదు, మిగిలిన 75 శాతం మంది కూడా ఆరెస్సెస్ కార్యకర్తలే అయితే.. దేశవ్యాప్తంగా వారిని వ్యాప్తి చేయొచ్చని అన్నారు. తద్వార ఆరెస్సెస్ కార్యకర్తలను ఆర్మీలోపల, ఆర్మీ వెలుపల కూడా సిద్ధంగా ఉంచొచ్చు అని ఆరోపించారు. తద్వార కొన్నేళ్లకు ఆర్మీనే తమ గుప్పిట్లోకి తీసుకోవచ్చని అన్నారు. అనంతరం దేశంలో నాజీ పోరాటాన్ని wప్రారంభించవచ్చని ఆరోపణలు చేశారు.

ఆరెస్సెస్ సంస్థ జర్మనీలో హిట్లర్ పాలన ఉన్న కాలంలోనే పుట్టిందని ఆయన పేర్కొన్నారు. బహుశా ఆరెస్సెస్ మన దేశంలోనూ నాజీ పాలనకు ప్రయత్నిస్తున్నదేమో అని ఆరోపణలు చేశారు. అందుకోసమే వారు అగ్నిపథ్ లేదా అగ్నివీర్ కాన్సెప్ట్‌ను రూపొందించి ఉండొచ్చని తెలిపారు. ఈ విషయాలపై ఎంతో చర్చ జరగాల్సి ఉన్నదని అన్నారు. అంతేకాదు, తనకు కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయని చెప్పారు.

అసలు అగ్నిపథ్ స్కీం తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఎవరు కోరారు? అని ప్రశ్నించారు. ఈ స్కీం రూపకల్పనలో ముందు నుంచి ఆరెస్సెస్ యాక్టివ్‌గా ఉన్నదేమో అనిపిస్తున్నదని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ప్రతినిధి షెహెజాద్ పూనావాల సీరియస్ అయ్యారు. ఆయన వ్యాఖ్యలు బీజేపీ, ఆరెస్సెస్‌ను టార్గెట్ చేయలేదని, ఆర్మీ లక్ష్యంగా కామెంట్లు చేశారని వివరించారు. ఆయన వ్యాఖ్యలు ఆర్మీని అగౌరవపరచడమేనని మండిపడ్డారు.