పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించింది. 117 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ ఏకంగా 92 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ పంజాబ్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ నేడు ఢిల్లీకి బయలుదేరి అరవింద్ కేజ్రీవాల్ ను కలవనున్నారు.
పంజాబ్ (punjab) అసెంబ్లీ ఎన్నికలను ఆమ్ ఆద్మీ పార్టీ (aam admi party) క్లీన్ స్వీప్ చేసింది. కాంగ్రెస్ ను గద్దెదింపి తొలిసారిగా పంజాబ్ లో ఆప్ అధికారం చేపట్టనుంది. కాంగ్రెస్ (congress) సీనియర్ నాయకులను మట్టికరిపించి ఒక సామాన్యుడి పార్టీ పంజాబ్ పీఠాన్ని అధిరోహించబోతోంది. ఏ పార్టీ మద్దతు లేకుండా ఆప్ సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అయిపోతోంది. నిన్న కేంద్ర ఎన్నికల కమిషన్ పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ 92 స్థానాల్లో విజయం సాధించిందని అధికారికంగా వెల్లడించింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు భగవంత్ మాన్ (Bhagwant Mann) సీఎం కుర్చీపై కూర్చోనున్నారు.
పంజాబ్ ఫలితాల అనంతరం తొలిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal)ను కలిసేందుకు భగవంత్ మాన్ శుక్రవారం ఢిల్లీ (delhi) వెళ్లనున్నారు. దేశ రాజధానికి బయలుదేరే ముందు సంగ్రూర్ (Sangrur) లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను అరవింద్ కేజ్రీవాల్ ను కలవబోతున్నానని తెలిపారు. పంజాబ్ ఎన్నికల్లో పార్టీ అద్భుత విజయం సాధించినందుకు అభినందనలు తెలియజేస్తానని చెప్పారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. తాను రేపు పంజాబ్ గవర్నర్ ను కలుస్తానని తెలిపారు. ఈ రోజు తాము ఆయన నుంచి సమయం కోరుతామని భగవంత్ మాన్ చెప్పారు. అయితే తాను రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయబోనని తెలిపారు. స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ (Bhagat Singh) పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలాన్ ( Khatkar Kalan) లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. పార్టీ అఖండ విజయంపై ఆయన స్పందిస్తూ.. ‘‘ ప్రజలు అహంకారపూరిత వ్యక్తులను ఓడించారు. సామాన్య ప్రజలకు విజయం అందించారు ’’ అని తెలిపారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన భగవంత్ మాన్ ధురి స్థానం నుంచి 58,206 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. మొత్తంగా 117 అసెంబ్లీ స్థానాలకు గాను 92 స్థానాల్లో ఆప్ విజయం సాధించింది. ప్రస్తుత పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ (charanjith singh channi), ప్రకాష్ సింగ్ బాదల్ (prakash singh badhal), అమరీందర్ సింగ్ (Amarinder Singh) సహా పలువురు ప్రముఖులు ఆప్ అభ్యర్థుల చేతిలో చిత్తుగా ఓడిపోయారు.
పంజాబ్ అసెంబ్లీకి 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించింది. దీంతో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ పార్టీ అంతర్గత కుమ్ములాటలు, సీఎంపై అవినితీ ఆరోపణలు, అమరీందర్ సింగ్ రాజీనామా వంటి విషయాలు కాంగ్రెస్ ను ఓటమి పాలు చేశాయి. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 18 స్థానాలకే పరిమితమం అయ్యింది. పంజాబ్ లోని రెండు స్థానాల నుంచి సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ పోటీ చేశారు. ఆ రెండు స్థానాల నుంచి ఆయన ఓడిపోయారు. అనేక మంది సీనియర్ నాయకులు కూడా ఓడిపోయారు. దీంతో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పంజాబ్ ను వదులుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది.
