ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి సత్యేందర్ జైన్ అరెస్టు తర్వాత నెక్స్ట్ టార్గెట్ మరో మంత్రి మనీశ్ సిసోడియా అని అన్నారు. ఆయనపై ఫేక్ కేసు పెట్టి అరెస్టు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏజెన్సీలను ఆదేశించినట్టు తనకు తెలిసిందని వివరించారు. 

న్యూఢిల్లీ: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ హోం శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్‌ను ఈడీ అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఓ మనీ లాండరింగ్ కేసులో మినిస్టర్ సత్యేందర్ జైన్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకుంది. సత్యేందర్ జైన్‌ అరెస్టును ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జనవరిలోనే ఊహించి చెప్పారు. పంజాబ్ ఎన్నికల ముందు సత్యేందర్ జైన్‌ను అరెస్టు చేస్తారని కేజ్రీవాల్ చెప్పారు. పంజాబ్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన చెప్పినట్టుగానే మంత్రి సత్యేందర్ జైన్‌ను ఈడీ అరెస్టు చేసింది. తాజాగా, మరోసారి కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్యేందర్ జైన్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ మంత్రి మనీశ్ సిసోడియా అని అన్నారు. త్వరలోనే కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు ఢిల్లీ విద్యా శాఖ మంత్రి మనీశ్ సిసోడియాపై ఫేక్ కేసులు పెడతాయని, ఆ ఫేక్ కేసులోనే ఆయనను అరెస్టు చేస్తాయని జోస్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలకు మనీశ్ సిసోడియాను అరెస్టు చేయాలని ఆదేశించినట్టు తనకు తెలిసిందని వివరించారు. ఓ అవినీతి కేసు పెట్టి అందులో అరెస్టు చేయాలని ఆదేశించినట్టు తెలిసిందని అన్నారు.

భారత విద్యా విప్లవానికి మనీశ్ సిసోడియా వ్యవస్థాపకుడు అని కేజ్రీవాల్ వివరించారు. సిసోడియా కారణంగా భవిష్యత్‌పై భరోసా పొందిన 18 లక్షల విద్యార్థులను తాను కొన్ని విషయాలను అడగాలని అనుకుంటున్నట్టు తెలిపారు. నిజంగా మనీశ్ సిసోడియా అవినీతిపరుడా? అని అడిగారు. విద్యార్థుల తల్లిదండ్రులనూ తాను అడుగుతున్నట్టు పేర్కొన్నారు. వాళ్లు మనీశ్ సిసోడియాను అవినీతిపరుడు అంటున్నారని, మీరేం అనుకుంటున్నారని ప్రశ్నించారు. సిసోడియా అవినీతిపరుడు అయితే.. నిజాయితీపరుడు ఎవరు అని అడిగారు.

ఆప్ నేతలు అందరినీ అరెస్టు చేయాలని ఆయన ప్రధాని మోడీని అడిగారు. ఆప్ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరినీ ఒకేసారి జైలులో వేసేయాలని ప్రధాని మోడీని కోరారు.. అందరినీ జైలులో పెట్టి అన్ని కేంద్ర ఏజెన్సీలు ఒకేసారి దర్యాప్తు చేయాలని, ఎన్నిసార్లు తనిఖీలు చేసినా తాము అభ్యంతరం చెప్పమని వివరించారు. కానీ, ఒక్కో మంత్రిని ఒక్కోసారి అరెస్టు చేయవద్దని కోరారు. ఇది ప్రజా సేవను ఆటంకపరుస్తుందని తెలిపారు.

కొందరు ఈ అరెస్టులు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కారణంగా అని అంటున్నారని, మరికొందరు పంజాబ్ ఎన్నికల్లో ఆప్ విజయానికి ప్రతీకారంగానే ఈ చర్యలు తీసుకుంటున్నారని ఇంకొందరు అంటున్నారని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. కారణం ఏదైనా.. అరెస్టులకు మేం భయపడం అని స్పష్టం చేశారు. ఇది వరకు ఐదేళ్లలో ఆప్ నేతలపై ఎన్నోసార్లు తనిఖీలు, రైడ్లు చేశారని వివరించారు. కానీ, ఆ రైడ్లలో ఏదీ రికవరీ చేసుకోలేదని తెలిపారు.

రూ. 4.81 కోట్ల ఆస్తుల మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ.. ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌ను అరెస్టు చేసింది. ఈ ఆస్తులను ఈడీ అటాచ్ చేసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తులుగా వీటిని పేర్కొంటున్నది. ప్రస్తుతం సత్యేందర్ జైన్ ఈడీ కస్టడీలో ఉన్నారు.