ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై భారత వైఖరిని రష్యా ప్రభుత్వం ప్రశంసించింది. ఈ వెంటనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి ఐరాసలో రాజకీయ మద్దతు కావాలని కోరినట్టు ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: ఉక్రెయిన్(Ukraine) సంక్షోభంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(UNSC)లో భారత్ వైఖరిపై రష్యా(Russia) ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. భారత్(India) స్వతంత్రంగా, బ్యాలెన్సింగ్‌గా వ్యవహరించిందని రష్యా పేర్కొంది. రష్యా ఈ ప్రశంసలు చేయగానే.. ఉక్రెయిన్ దృష్టి మరోసారి భారత్ వైపు మరల్చింది. వెంటనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. భారత్ తమకు రాజకీయ మద్దతు ఇవ్వాలని కోరినట్టు జెలెన్‌స్కీ ట్విట్టర్‌లో వెల్లడించారు. తమ దేశంలో సుమారు ఒక లక్షల మంది దురాక్రమణదారులు ఉన్నారని వివరించారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ ఈ రోజు సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ట్వీట్ చేశారు. తాను భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడినట్టు వెల్లడించారు. ఉక్రెయిన్‌లో రష్యా చేస్తున్న బలప్రయోగాన్ని ఆయనకు వివరించానని పేర్కొన్నారు. ఒక లక్షకు పైగా రష్యాకు చెందిన జవాన్లు తమ దేశ భూభాగంలో ఉన్నట్టు తెలిపారు. వారు తమ దేశంలోని నివాస భవనాలపై కాల్పులు జరుపుతున్నారని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తమకు రాజకీయ మద్దతు ఇవ్వాలని భారత్‌ను కోరినట్టు వివరించారు. ఆక్రమణదారుడిని అందరం కలిసి సంయుక్తంగా అడ్డుకుందామని పేర్కొన్నారు. కాగా, భారత ప్రధాన మంత్రి కార్యాలయం కూడా ఈ ఫోన్ కాల్‌పై ప్రకటన విడుదల చేసింది.
ఐరాసలో భారత్ వ్యూహాత్మక వైఖరితో ఇప్పుడు ఉభయ వర్గాల మధ్య పెద్దన్న పాత్రపోషించే అవకాశం కల్పించుకుంది. ఈ రెండు దేశాల సంక్షోభాన్ని పరిష్కరించడానికి మధ్యవర్తిగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇటు ఉక్రెయిన్, అటు రష్యాలతో భారత్ సంప్రదింపులు జరిపే అవకాశాన్ని కల్పించుకుంది.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ అమెరికా సారథ్యంలో 12 దేశాలు తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. కానీ, ఈ తీర్మానంపై చైనా, భారత్, యూఏఈలు ఓటు వేయకుండా దూరంగానే ఉండిపోయాయి. రష్యాపై తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తూనే ఆ తీర్మానానికి మాత్రం భారత్ ఓటేయలేదు. వెంటనే రష్యా దాడులు ఆపి.. రక్తపాతాన్ని ఆపాలని సూచించింది. అయితే, రష్యాకు ఉన్న శాశ్వత సభ్యత్వంతో ఈ తీర్మానాన్ని వీటో చేసింది. అయితే, ఈ తీర్మానంపై భారత్ ఓటు వేయని నేపథ్యంలో రష్యా ప్రశంసలు కురిపించింది. భారత్ స్వతంత్రంగా, సంతులనంగా వ్యవహరించిందని పేర్కొంది. భారత్‌తో ప్రత్యేక, వ్యూహాత్మక, హుందా బంధాలను రష్యా కలిగి ఉన్నదని, అందుకు కట్టుబడి ఉక్రెయిన్ చుట్టూ ఉన్న పరిస్థితులను భారత్‌కు సమగ్రంగా వివరిస్తామని రష్యా తెలిపింది.
కాగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడినట్టు పీఎంవో వెల్లడించింది. ఉక్రెయిన్‌లోని ఉద్రిక్తతలను జెలెన్‌స్కీ.. ప్రధాని మోడీకి వివరించారని, అక్కడ జరుగుతున్న ప్రాణ నష్టంపై మోడీ ఆవేదన వ్యక్తం చేశారని వివరించింది. వెంటనే హింసామార్గాన్ని ఆపేసి చర్చల బాట పట్టాలని ప్రధాని పునరుద్ఘాటించారు. శాంతి ప్రక్రియకు భారత్ అన్ని విధాల తోడ్పడుతుందని హామీ ఇచ్చారు. అదే సమయంలో ఉక్రెయిన్‌లోని భారత విద్యార్థుల యోగ క్షేమాల గురించీ ఆందోళన వ్యక్తం చేశారు. వారిని వెంటనే తరలించడానికి ఉక్రెయిన్ అధికారులు అన్ని విధాల సహకరించాలని కోరినట్టు పీఎంవో తెలిపింది.
