మహారాష్ట్ర లో బీజేపీ, శివసేన మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంటోంది. మొన్నటి వరకు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు విమర్శలు కురిపించుకునే వారు.. కాగా.. ఇప్పుడు ఈ మాటల యుద్ధం బ్యానర్ల వరకు వెళ్లింది.

ఇటీవల వసేన ఎంపీ సంజయ్‌‌ రౌత్‌‌ భార్య వర్షా రౌత్‌కు ఈడీ సమన్లు జారీచేయడంతో శివసైనికులు సోమవారం ఈడీ కార్యాలయం ఎదుట ‘బీజేపీ ప్రదేశ్‌ కార్యాలయ్‌’ అని బ్యానర్‌ ఏర్పాటు చేశారు. శివసేన భవన్‌ ఎదుట భారీ సంఖ్యలో పోగైన మహిళలు ఈడీ, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు

పీఎంసీ బ్యాంకు నగదు అక్రమ రవాణా కేసులో శివసేన ఎంపీ సంజయ్‌ రావుత్‌ భార్య వర్షా రౌత్‌కు ఈడీ సమన్లు జారీచేసిన నేపథ్యంలో శివసైనికులు ఆగ్రహానికి గురయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకులపై ఈడీని ఉసిగోల్పుతోందని ఆరోపించారు. ఈ సందర్భంగా సంజయ్‌ రావుత్‌ సోమవారం విలేకరుల సమావేశంలో బీజేపీపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఈడీ ద్వారా తమపై ఒత్తిడి తీసుకొచ్చి మహా వికాస్‌ ఆఘాడీ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుందని రావుత్‌ ఆరోపించారు. సంవత్సర కాలం నుంచి తమను బెదిరిస్తూ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. అందుకు ఈడీ, సీబీఐ అ్రస్తాన్ని ప్రయోగిస్తున్నారని అన్నారు.

కాగా..  దీనిపై మంత్రి ఆదిత్య ఠాక్రే స్పందించారు. సంజయ్‌రావుత్‌ సతీమణి వర్షా రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీచేయడం రాజకీయ కక్ష్యతోనే జరిగి ఉంటుందని, మేం కేసులకు భయపడమని ఆయన పేర్కొన్నారు. 

మేం భయపడం, మహావికాస్‌ ఆఘాడీ ప్రభుత్వం స్థిరంగా ఉంది. ఈడీ సమన్లు రాజకీయ కక్ష్యలో భాగమే’ అని వ్యాఖ్యానించారు. ముంబైలోని ఫెడరల్‌ ఎజెన్సీ ముందు హాజరు కావాలని వర్షా రావుత్‌కు ఈడీ ఇప్పటికే మూడు నోటీసులు పంపినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఆవిడ ఆరోగ్యం బాగాలేనందున విచారణకు హాజరుకాలేకపోయినట్లు సమాచారం.