ప్రధాని మోడీ అమెరికా పర్యటన ముగించి ఈజిప్టు దేశానికి బయల్దేరి వెళ్లారు. అక్కడ ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతే అల్ సిసి, ఇతర ప్రముఖ నేతలతో మోడీ సమావేశం కాబోతున్నారు. హీలియోపోలిస్ కామన్వెల్త్ యుద్ధ స్మశానవాటికను సందర్శించి భారత జవాన్లకు నివాళి అర్పించనున్నారు.
న్యూఢిల్లీ: అమెరికాలో మూడు రోజులపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించారు. అమెరికా స్టేట్ విజిట్ చేశారు. ఆయన శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అమెరికా తొలి పౌరురాలు జిల్ బైడెన్‌తో లంచ్ చేశారు. పలు టెక్ కంపెనీల అధినేతలతో భేటీ అయ్యారు. టెస్లా సీఈవో ఎలన్ మస్క్, మైక్రాన్ సీఈవో సహా పలు కంపెనీల అధినేతలతో మాట్లాడారు. భారత్‌లో పెట్టుబడుల ప్రణాళికలను వారు వెల్లడించారు.
ఈ పర్యటనలో చారిత్రక ఒప్పందాలు జరిగాయి. ఉభయ దేశాల బంధం మరింత బలోపేతమైంది. ఈ బంధం ఆకాశమే హద్దుగా ఎదిగింది. నేటితో అమెరికా పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈజిప్టుకు బయల్దేరి వెళ్లారు.
1997 తర్వాత ఈజిప్టు దేశాన్ని పర్యటిస్తున్న భారత ప్రధాని పర్యటించడం ఇదే ప్రథమం. ఈ పర్యటన గురించి ప్రధాని మోడీ స్పందించారు. ఈజిప్టు.. భారత దేశానికి అత్యంత సన్నిహిత దేశంగా పేర్కొన్నారు. ఈ దేశాన్ని సందర్శించడం సంతోషంగా ఉన్నదని వెల్లడించారు.
Also Read: ప్రస్తుతం బీజేపీలో ఉన్నా.. లక్ష్య సాధన కోసం ఎటువంటి నిర్ణయమైన తీసుకుంటాను: రాజగోపాల్ రెడ్డి
ఈ పర్యటనలో మోడీ.. ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతే అల్ సిసితో సమావేశం అవుతారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, బహుళ భాగస్వామ్యాల గురించి వీరిద్దరూ చర్చించే అవకాశం ఉన్నది. అక్కడ భారత సంఘాలను, ప్రవాస భారతీయులనూ మోడీ కలుసుకోనున్నారు. అలాగే, కైరోలోని హీలియోపోలిస్ కామన్వెల్త్ యుద్ధ స్మశానవాటికను సందర్శిస్తారు. అక్కడ ఈజిప్టు, పాలస్తీనాల తరఫున బ్రిటీష్ ఆర్మీలో భాగంగా పోరాడి అసువులు బాసిన భారత జవాన్లకు నివాళులు అర్పించనున్నారు.
