పెగాసెస్ అంశంపై విపక్షాల నిరసనల నేపథ్యంలో లోక్‌సభ నిరవధికంగా వాయిదాపడింది. ఈ నెల 13వ తేదీ వరకు లోక్‌సభ సమావేశాలు జరగాలి. కానీ నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే వాయిదాపడ్డాయి.

న్యూఢిల్లీ: లోక్‌సభ బుధవారం నాడు ఉదయం నిరవధికంగా వాయిదా పడింది. ఈ నెల 13వ తేదీ వరకు లోక్‌సభ సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే సమావేశాలు ప్రారంభమైన నాటి నుండి పెగాసెస్ అంశంపై విపక్షాల ఆందోళనల నేపథ్యంలో కార్యక్రమాలు సాగడం లేదు. పార్లమెంట్‌‌ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు పదేపదే ఆందోళనలు నిర్వహించాయి.

పెగాసెస్ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ విపక్షాలు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి ఆందోళనలు చేస్తున్నాయి.బుధవారం నాడు లోక్‌సభ సమావేశమైన కొద్దిసేపటికే వాయిదా పడింది.మంగళవారం నాడు ఓబీసీ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లుపై చర్చకు విపక్షాలు సహకరించాయి. ఈ బిల్లు మినహా ఇతర బిల్లులపై విపక్షాల నిరసనల మధ్యే ఆమోదం పొందాయి.ఈ ఏడాది జూలై 19వ తేదీన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.17 రోజుల పాటు లోక్‌సభ సమావేశాలు జరిగాయి.