వాళ్లిద్దరికీ పెళ్లి కుదిరింది. నిశ్చితార్థం కూడా అయిపోయింది. పెళ్లికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఆ పెళ్లి రోజు కూడా రానే వచ్చేసింది. ఆ సందడి జరుగుతుండగా.. అనూహ్యంగా పెళ్లి కూతురు కుప్పకూలింది. బంధువులంతా కంగారుపడిపోయారు.  తీరా చెక్ చేస్తే.. వధువు చనిపోయింది. అంతే.. అందరూ పెళ్లి ఆగిపోయిందని అనుకున్నారు.

అయితే.. వరుడు తీసుకున్న నిర్ణయం అందరినీ విస్మయానికి గురిచేసింది. పెళ్లి కూతురు చనిపోయిందని అందరూ బాధపడుతున్నా పెళ్లి తంతు పూర్తి చేయడం గమనార్హంం.  పెళ్లికూతురు చెల్లెలి మెడలో తాళికట్టేశాడు. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఈత్వా జిల్లాకు చెందిన యువతి సురభి కి మంజేష్ కుమార్ అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి రోజు కూడా వచ్చేసింది. మరికాసేపట్లో యువతి మెడలో పెళ్లి కొడుకు తాళి కడతాడు అనుకునేలోగా..  వధువు సురభి కుప్పకూలింది.

గుండెనొప్పి కారణంగా.. వధువు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్థారించారు. కాగా.. ఈ ఘటనపై వధువు సోదరుడు సౌరభ్ మీడియాతో మాట్లాడారు.

‘ మాచెల్లి సురభి ఒక్కసారి చనిపోవడంతో ఏం చేయాలో మాకు ఏమీ అర్థం కాలేదు. ఈలోగా.. మా రెండో చెల్లి నీషాతో పెళ్లి చేయాలని చాలా మంది ఒత్తిడి చేశారు. దీంతో.. అలా చేయాల్సి వచ్చింది’ అని వధువు సోదరుడు చెప్పడం గమనార్హం.

చనిపోయిన సురభి మృతదేహాన్ని.. వేరే గదిలో ఉంచి.. వీరిద్దరికీ పెళ్లి చేశారు. పెళ్లి బారాత్ పూర్తైన తర్వాత.. చనిపోయిన యువతి దహన సంస్కారాలు నిర్వహించారు.