Bars Open 24/7 :మద్యం ప్రియులకు హర్యానా సర్కార్ శుభవార్త. బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లలో 24 గంటలపాటు మద్యాన్ని విక్రయించేందుకు అనుమతినిస్తూ హర్యానా ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకొన్నది. తొలిదఫాలో జూన్ 12 నుంచి గురుగ్రామ్‌లో నూతన విధానాన్ని అమలు చేయనున్నారు.
Bars Open 24/7 : మందు బాబులకు హర్యానా సర్కార్ మంచి కిక్కెంచే వార్త చెప్పింది. నూతన మద్యం లైసెన్సింగ్ విధానాన్ని శుక్రవారం హర్యానా ప్రభుత్వం ఆమోదించింది. ఇందులో భాగంగా బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లలో 24 గంటలపాటు మద్యాన్ని విక్రయించేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. తొలి దఫాలో జూన్ 12 నుంచి గురుగ్రామ్‌లో కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి.
ఈ నిబంధనల ప్రకారం.. గురుగ్రామ్‌లో మద్యం అందించే పబ్‌లు మరియు రెస్టారెంట్లు 24/7 తెరిచేందుకు అవకాశం లభించింది. మద్యం అందించే బార్‌లు మరియు రెస్టారెంట్లు తెల్లవారుజామున 3 గంటల వరకు తెరిచి ఉంటాయి. అయితే.. నగరంలోని బార్ల నిర్వాహకులు వార్షిక రిటైల్ లిక్కర్ లైసెన్స్ రుసుముకు మరో రూ. 18 లక్షలు అదనంగా చెల్లిస్తే.. బార్లు, రెస్టారెంట్లు 24 గంటలపాటూ మద్యాన్ని విక్రయించవచ్చని అధికారులు తెలిపారు. మద్యం అమ్మకాలపై వ్యాట్ తగ్గించడం వల్ల మద్యం ధరలను కూడా తగ్గించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
గురుగ్రామ్ (తూర్పు) ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ డిప్యూటీ కమిషనర్ VK బెనివాల్ మాట్లాడుతూ.. జిల్లాలో దాదాపు 287 మద్యం దుకాణాలు ఉన్నాయని, ఒక్కో జోన్‌లో రెండు విక్రయ కేంద్రాలు ఉన్నాయని, వీటిని ఇప్పుడు నాలుగుకు పెంచుతామని చెప్పారు. ఢిల్లీకి వెళ్లే కస్టమర్లను ఆకర్షించడమే తమ లక్ష్యమనీ కొత్త ఎక్సైజ్ పాలసీ ఆదాయాన్ని పెంచడానికి రూపొందించబడిందని బెనివాల్ అన్నారు. తాము పాలసీని పాకెట్-ఫ్రెండ్లీగా మార్చడానికి ప్రయత్నించామనీ, తద్వారా నగరంలో ఎక్కువ మంది తమ కార్యకలాపాలను ప్రారంభించవచ్చని తెలిపారు. ఇప్పుడు పబ్‌లు, బార్‌లు మరియు రెస్టారెంట్‌లను తెరవడానికి ఇప్పుడు మరిన్ని ఆప్షన్స్ కలిగి ఉంటారని తెలిపారు. బార్లు, రెస్టారెంట్లు ఇప్పుడు 24x7 పని చేయవచ్చని, అదనపు మద్యం లైసెన్స్ రుసుము చెల్లించే అవుట్‌లెట్‌ల సమయాలపై ఎటువంటి పరిమితి ఉండదని, వారు ఉదయం 8 గంటల నుండి మద్యం అందించడం ప్రారంభించవచ్చు. జూన్ నుండి వాటిపై ఎటువంటి పరిమితి లేదని తెలిపారు.
7938 కోట్ల 8 లక్షల ఆదాయం
2020-21 ఎక్సైజ్ పాలసీ ద్వారా రాష్ట్రానికి రూ.7345 కోట్ల 92 లక్షల ఆదాయం వచ్చింది. అదే సమయంలో, ప్రస్తుత ఎక్సైజ్ పాలసీ ద్వారా వచ్చే ఆదాయం 2021-22లో రూ.7938 కోట్ల 8 లక్షలుగా అంచనా వేయబడింది. ఇది గతేడాది కంటే దాదాపు 17 శాతం ఎక్కువ. ముఖ్యమైన విషయం ఏమిటంటే, రెండేళ్లుగా కోవిడ్ కారణంగా, మొత్తం ఆదాయంపై ప్రభావం పడింది. ఇంతకు ముందు రెవెన్యూ ఎక్సైజ్ పాలసీ ద్వారా 2018-19లో రూ.5566 కోట్ల 22 లక్షలు, 2019-20లో రూ.5794 కోట్ల 90 లక్షలు వచ్చాయి.
విస్కీ సాంబా బార్ అండ్ గ్రిల్ వ్యవస్థాపకుడు ఆశిష్ దేవ్ కపూర్ మాట్లాడుతూ.. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. కొత్త పాలసీ లైఫ్‌లైన్ తిరిగి లాభాలు పొందడంలో సహాయపడుతుందని ఆశించారు. ఢిల్లీలో ప్రభుత్వం తన లైసెన్సుదారులకు అందజేస్తున్న అన్ని ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది పాలసీని రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం మొదటిసారిగా హర్యానా.. ఢిల్లీ తరహాలో ఆన్‌లైన్ అప్లికేషన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసిందని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ట్రస్టీ రాహుల్ సింగ్ అన్నారు.
నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) ట్రస్టీ రాహుల్ సింగ్ మాట్లాడుతూ.. బీర్, వైన్ RTDలు (5% కంటే తక్కువ ఆల్కహాల్ కలిగిన పానీయాలు త్రాగడానికి సిద్ధంగా ఉన్న పానీయాలు) వంటి తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్‌ను ప్రోత్సహించడానికి వార్షిక లైసెన్స్ రుసుము ఉపయోగపడుతోందని అన్నారు. వార్షిక లైసెన్స్ ఫీజు గురుగ్రామ్, ఫరీదాబాద్ మరియు పంచకుల కోసం ₹ 5 లక్షలు, ఇతర పట్టణాలకు ₹ 2 లక్షలని అన్నారు.
