భార్యభర్తలు వృత్తి రిత్యా ఓక్కో ప్రాంతంలో ఉంటూ ఇబ్బంది పడుతుండగా.. వారిని ఒకే గూటికి చేర్చారు బిగ్ బి.  వారిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. కానీ.. ఒక్కొక్కరిది ఒక్కో చోట ఉద్యోగాలు. దీంతో.. వారి జీవితాలు నువ్వాదరిన.. నేనీదరిన అన్నట్లుగా ఉండిపోయాయి.

తమను ఒకేచోట వేయడంటూ బదిలీల కోసం ఆ దంపతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ చొరవ కారణంగా ఈ దంపతుల సమస్య తీరింది. మధ్యప్రదేశ్‌కు చెందిన వివేక్‌ పర్మార్‌, మహారాష్ట్ర బోర్డర్‌లోని మంద్‌సౌర్‌లో ట్రాఫిక్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.

 ఆయన భార్య కూడా ట్రాఫిక్‌ కానిస్టేబులే. అయితే యూపీ సరిహద్దులోగల గ్వాలియర్‌లో పనిచేస్తున్నారు. ఉద్యోగ బాధ్యతల కారణంగా మూడేళ్లుగా భార్యాభర్తలు దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఇటీవల కౌన్‌ బనేగా కరోడ్‌పతి (కేబీసీ)లో పోటీదారుడిగా పాల్గొన్న వివేక్‌, ఈ విషయాన్ని కార్యక్రమ వ్యాఖ్యాత అయిన అమితాబ్‌తో పంచుకున్నారు. 

అంతావిని చలించిపోయిన అమితాబ్‌.. ఇద్దరూ ఒకేచోట పనిచేసేలా చేయడం ద్వారా వివేక్‌ దంపతులను కలపాలంటూ కేబీసీ వేదికగానే మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో మధ్యప్రదేశ్‌ సర్కారు సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం వివేక్‌ పనిచేస్తున్న మంద్‌సౌర్‌కు ఆయన భార్యను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ  అయ్యాయి.