బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్  అఙ్ఞాతంలోకి వెళ్లారు. ఇటీవల తేజ్ ప్రతాప్ యాదవ్.. తన భార్య ఐశ్వర్యారాయ్ తో విడిపోవడానికి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పట్నా న్యాయస్థానంలో ఆయన విడాకుల కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు.

అయితే.. విడాకుల నిర్ణయం వెనక్కి తీసుకోమని తేజ్ ప్రతాప్ యాదవ్ ని అతని కుటుంబసభ్యులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. విడాకులు వద్దని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుండటంతో.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం ఇష్టం లేని తేజ్..  అఙ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గత రెండు రోజులుగా బోధ్‌ గయలోని ఓ హోటల్‌లో బస చేసిన తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ సోమవారం మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో టచ్‌లోనే ఉన్నారు. 

కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం  తేజ్‌ ప్రతాప్‌ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారని అతడి భద్రతా సిబ్బంది తెలిపారు. ఎంతసేపటికి ఆయన తలుపు తెరవకపోవడంతో తమ వద్ద ఉన్న వేరొక కీతో రూం తెరచి చూడగా.. వెనుక డోర్‌ నుంచి ఆయన వెళ్లిపోయారని పేర్కొన్నారు. కాగా.. ఈ విషయంపై లాలూ కుటుంబసభ్యులు ఎవరూ స్పందించకపోవడం గమనార్హం.