ఈశాన్య శాంతి భద్రతలు అదుపులో ఉంటున్నాయని, అందుకే ఈ ప్రాంతాల్లో AFSPAను ఎత్తేశామని ప్రధాని నరేంద్ర అన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ అస్సాంలో నేడు అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఈశాన్య రాష్ట్రాల్లో మెరుగైన శాంతి భద్రతలు కొన‌సాగుతున్నాయ‌ని, అందుకే ఈ ప్రాంతంలో AFSPAను తొల‌గించామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. డబుల్ ఇంజ‌న్ ప్ర‌భుత్వాల వల్లే ఇక్క‌డ శాంతి సాధ్య‌మైంద‌ని తెలిపారు. ‘శాంతి, ఐక్యత, అభివృద్ధి ర్యాలీ’లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అస్సాంలోని కర్బి ఆంగ్లాంగ్ జిల్లా దీపూ చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో ప్ర‌ధాని మాట్లాడారు. డ‌బుల్ ఇంజిన్ల ప్ర‌భుత్వాలను ప్ర‌శంసించారు. ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ స్ఫూర్తితో పనులు జరుగుతున్నాయని అన్నారు.

అస్సాం-మేఘాలయ సరిహద్దు ఒప్పందాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇది మిగితా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా స‌రిహ‌ద్దుల స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపించే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. ఆ రాష్ట్రాలు కూడా ఒప్పందాల వైపు మొగ్గు చూప‌డాన్ని ప్రోత్స‌హిస్తుంద‌ని తెలిపారు. ఇటీవల అస్సాంలోని 23 జిల్లాల నుంచి సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టాన్ని తొలగించాని అన్నారు. మెరుగైన శాంతి భద్రతల ఫలితంగానే ఇది సాధ్యం అయ్యింద‌ని అన్నారు. 

‘‘ గత సంవత్సరం కర్బీ అంగ్లాంగ్ నుండి అనేక సంస్థలు శాంతి, అభివృద్ధి కోసం సంకల్పించాయి. బోడో -2020లో శాశ్వత శాంతికి కొత్త ద్వారాలు తెరిచింది’’ అని ప్రధాని మోడీ అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ ’ స్పూర్తితో పనులు జరుగుతున్నాయని అన్నారు. 

కాగా నేటి ఉద‌యం అస్సాంలోని కర్బికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్క‌డ డిఫులో వెటర్నరీ కాలేజీ, వెస్ట్ కర్బి ఆంగ్లాంగ్లోని డిగ్రీ కాలేజీ, కొలోంగాలోని అగ్రికల్చరల్ కాలేజ్ సహా ఆరోగ్య సంరక్షణ, విద్యకు సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇదిలా ఉండ‌గా 2950కి పైగా అమృత్ సరోవర్ ప్రాజెక్టులకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారని ప్రధాని కార్యాలయం (పీఎంవో) తెలిపింది. రూ.1150 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రం సరోవర్లను అభివృద్ధి చేయ‌నున్న‌ట్టు పేర్కొంది. 

‘‘ ఆరు కర్బీ మిలిటెంట్ సంస్థలతో భారత ప్రభుత్వం, అస్సాం ప్రభుత్వం ఇటీవల మెమోరాండం ఆఫ్ సెటిల్మెంట్ (ఎంఓఎస్) పై సంతకం చేయడంతో ఈ ప్రాంత శాంతి, అభివృద్ధి పట్ల ప్రధాన మంత్రి అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం. ఈ ప్రాంతంలో కొత్త శాంతి శకానికి ఎంఓఎస్ నాంది పలికింది. శాంతి, ఐక్యత, అభివృద్ధి ర్యాలీలో ప్రధాని ప్రసంగం మొత్తం ప్రాంతంలో శాంతి కార్యక్రమాలకు పెద్ద ఊతం ఇస్తుంది ’’ అని పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది.