G20 Summit 2023: ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం.. అసోమానికి ప్రధాని మోదీ బిగ్ హగ్..
భారత రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆఫ్రికన్ యూనియన్ శనివారం జీ20లో శాశ్వత సభ్యత్వం పొందింది.

భారత రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆఫ్రికన్ యూనియన్ శనివారం జీ20లో శాశ్వత సభ్యత్వం పొందింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఈ ప్రతిపాదనను అన్ని సభ్య దేశాలు స్వాగతించాయి. ఆ తర్వాత ప్రధాని మోదీ.. యూనియన్ ఆఫ్ కొమొరోస్ ప్రెసిడెంట్, ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ) ఛైర్‌పర్సన్ అజాలి అసోమానిని జీ 20 హై టేబుల్‌లో కూర్చోవాలని ఆహ్వానించారు. ఆనందోత్సాహాలు మరియు చప్పట్ల మధ్య, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అసోమనీని ఆయన సీటుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ప్రధాని మోదీ, అసోమానీ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.
‘‘మీ అందరి మద్దతుతో నేను ఆఫ్రికన్ యూనియన్‌ను జీ 20 లో చేరాలని ఆహ్వానిస్తున్నాను’’ జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోడీ అన్నారు. ‘‘సబ్కా సాథ్ (అందరితో) సెంటిమెంట్‌కు అనుగుణంగా ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని భారతదేశం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై మనమందరం ఏకీభవిస్తున్నామని నేను నమ్ముతున్నాను’’ అని మోదీ పేర్కొన్నారు. దీంతో 55 దేశాల ఆఫ్రికన్ యూనియన్ జీ20లో శాశ్వత సభ్యత్వం పొందింది.
ఇక, గ్లోబల్ సౌత్‌లోని ఈ కీలక కూటమిని ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల ఎలైట్ గ్రూప్‌కి తీసుకురావాలనే ప్రతిపాదనకు మంచి స్పందన లభించింది.
ఇందుకు సంబంధించి ప్రధాని మోదీ ఎక్స్(ట్విట్టర్)లో ఓ పోస్టు చేశారు. ‘‘ఆఫ్రికన్ యూనియన్‌ను జీ20 కుటుంబంలో శాశ్వత సభ్యునిగా స్వాగతించడం గౌరవంగా ఉంది. ఇది జీ20ని బలోపేతం చేస్తుంది. గ్లోబల్ సౌత్ వాయిస్‌ని బలపరుస్తుంది’’ అని మోదీ పేర్కొన్నారు.
ఇక, ఆఫ్రికన్ యూనియన్ జీ20 సభ్యత్వం కోసం భారత్ చాలా కాలంగా ఒత్తిడి చేస్తోంది. ఈ ఏడాది జూన్‌లో ఆఫ్రికన్ యూనియన్‌ను గ్రూపింగ్‌లో శాశ్వత సభ్యుడిగా చేయాలని కోరుతూ ప్రధాని మోదీ జీ20 నేతలకు లేఖ రాశారు.