చెన్నై: తమిళనాడులోని అనకాపుత్తూరులో అదృశ్యమైన ఎలక్ట్రీషియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో శవమై తేలాడు. వివాహేతర సంబంధం కారణంగా అతన్ని ఆంధ్రప్రదేశ్ కు రప్పించి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన జంటను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. 

మృతదేహాన్ని వెలికి తీసి విచారణ జరపడానికి పోలీసులు సిద్ధపడ్డారు. అనకాపుత్తూరు లేబర్ పల్లికి చెందిన కార్తికేయన్ (42) ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. అతను గత డిసెంబర్ 18వ తేదీన ఇంటి నుంచి వెళ్లి ఆ తర్వాత తిరిగి రాలేదు. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతని సెల్ ఫోన్ ఆధారంగా విచారణ జరపడంతో చిత్తూరు జిల్ాల ఎస్సీ కాలనీ రెండో వీధికి చెందిన శివకుమార్ (38)తో అతను ఎక్కువసార్లు మాట్లాడినట్లు తేలింది. శివకుమార్, అతని భార్య మదేశ్వరిలను శంకర్ నగర్ కు రప్పించి పోలీసులు విచారణ జరిపారు.

కార్తికేయన్ ఎవరో తనకు తెలియదని శివకుమార్ బుకాయిస్తూ వచ్చాడు. అతని భార్య మాదేశ్వరిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పింది. దాంతో తమదైన శైలిలో పోలీసులు వారిని విచారించారు. దాంతో అసలు విషయం బయటకు వచ్చింది.

కార్తికేయన్ ఇంటి సమీపంలో శివకుమార్ సోదరుడు నివసిస్తున్నాడు. అతని ఇంటికి మూడు నెలల క్రితం శివకుమార్, అతని భార్య మాదేశ్వరి విందుకు వచ్చారు. ఆ సమయంలో కార్తికేయన్ తో మాదేశ్వరికి పరిచయం ఏర్పడింది. అది వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. వారం తర్వాత శివకుమార్ దంపతులు ఆంధ్రకు వెళ్లారు.

ఆ తర్వాత మాదేశ్వరికి శివకుమార్ ఫోన్ చేస్తూ తన వద్దకు వచ్చి తన కోర్కె తీర్చాలని, లేదంటే తనతో సన్నిహితంగా ఫోటొలోనుు నెట్ లో పెడుతానని బెదిరిస్తూ వచ్చాడు. భయపడిన మాదేశ్వరి విషయాన్ని తన భర్తకు చెప్పింది. 

దాంతో శివకుమార్ తన భార్య ద్వారా ఫోన్ చేయించి శివకుమార్ ను తమ వద్దకు రప్పించాడు. ఆ తర్వాత హత్య చేసి సమీపంలోని ఖాళీ స్థలంలో శవాన్ని పాతిపెట్టారు. శివకుమార్, మాదేశ్వరిలను పోలీసులు అరెస్టు చేశారు.