చెన్నై: తన కూతురి స్నేహితురాలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యాపారి ఆమె చేతిలోనే హతమయ్యాడు. తమిళనాడులోని ఉత్తర చెన్నైకి చెందిన కర్పూరం వ్యాపారి తిరువొత్తియూరులో హత్యకు గురయ్యాడు. సాత్తుమానగర్ ప్రాంతానికి ెచందిన అమ్మన్ శేఖర్ (54) సొంత ఊరు తూత్తుక్కుడి జిల్లాలో ఉంది. 

కొన్నేళ్ల క్రితం చెన్నైకి వచ్చి కర్పూరం హోల్ సేల్ వ్యాపారం సాగిస్తూ వస్తన్నాడు. అతనికి భార్య, కూతురు ఉన్నారు. కూతురు స్నేహితురాలి (25)పై అతనికి కన్ను పడింది. దాంతో ఆమెకు బహుమతులు ఇస్తూ సన్నిహితంగా మెలిగాడు. తర్వాత ఇద్దరి మధ్య లైంగిక సంబంధం కూడా ఏర్పడింది. కొంత కాలం పాటు ఇరువురు పలు చోట్ల విహార యాత్రలు చేస్తూ కాలం గడిపాడురు

అయితే, ఆ యువతికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూశారు. ఈ విషయం తెలుసుకున్న శేఖర్ యువతితో తీసుకున్న అశ్లీల వీడియోలు చూపించి వివాహం చేసుకోవద్దని బెదిరించాడు. దాంతో ఆగ్రహించిన యువతి శేఖర్ ను హత్య చేయడానికి నిర్ణయించుకుంది. 

సోమవారంనాడు ఇరువురు బెసంట్ నగర్, తదితర ప్రాంతాల్లో ఉల్లాసంగా గడిపారు. ఆ తర్వాత కొత్త చాకలిపేట హార్బర్ క్వార్టర్స్ మైదానం వైపు బైక్ ప్రయాణించారు. ఆ సమయంలో బైక్ ఆపాలని శేఖర్ ను యువతి కోరింది. తనకు ఓ గిఫ్ట్ ఇవ్వాలని కోరింది. 

కళ్లు మూసుకోవాల్సిందిగా ఆమె అతన్ని కోరింది. దాంతో అతను కళ్లు మూసుకున్నాడు. వెంటనే ఓ మత్తు స్ప్రేను అతనిపై చల్లింది. వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుపై పొడిచి పారిపోయింది. అమ్మన్ శేఖర్ స్పృహ తప్పి పడిపోయాడు. తర్వాత కొంత సేపటికి మరణించాడు. 

దానిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని యువతిని అరెస్టు చేశారు. యువతిని ఉరి తీయాలని వ్యాపారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.