ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 14వ ఎడిషన్ ఏరో ఇండియా షోను బెంగళూరులోని యెలహంకలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ఫిబ్రవరి 17 వరకు ఏరో ఇండియా 2023 షో కొనసాగనుంది. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 14వ ఎడిషన్ ఏరో ఇండియా షోను బెంగళూరులోని యెలహంకలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ఫిబ్రవరి 17 వరకు ఏరో ఇండియా 2023 షో కొనసాగనుంది. ఈ సందర్భంగా స్మారక స్టాంపులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నేడు ఏరో ఇండియా ఒక ప్రదర్శన మాత్రమే కాదు.. భారతదేశం ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబం అని అన్నారు. ఏరో ఇండియా భారతదేశం కొత్త బలం, సామర్థ్యాలను ప్రతిబింబిస్తుందని చెప్పారు. రక్షణ రంగంలో భారత్ బలోపేతం అయిందని తెలిపారు. 

నేడు మన విజయాలు భారతదేశ సామర్థ్యానికి నిదర్శనం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తేజస్ విమానమే దానికి ఉదాహరణ అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి రక్షణ ఎగుమతిదారుల్లో ఒకటిగా భారతదేశం ముందుకు సాగుతుందని చెప్పారు. నేడు భారతదేశం ప్రపంచంలోని రక్షణ సంస్థలకు మార్కెట్ మాత్రమే కాదని.. సంభావ్య రక్షణ భాగస్వామి అన్నారు. 21వ శతాబ్దపు కొత్త భారతదేశం ఏ అవకాశాన్ని కోల్పోదని చెప్పారు. 

నవ భారత సామర్థ్యానికి బెంగళూరు ఆకాశం సాక్షిగా మారుతోందని ప్రధాని మోదీ అన్నారు. కొత్త ఔన్నత్యమే నవ భారత సత్యమని బెంగళూరు ఆకాశం నిరూపిస్తోందని తెలిపారు. నేడు దేశం కొత్త శిఖరాలను తాకుతోందని చెప్పారు. ఏరో ఇండియా భారతదేశంలో విస్తరిస్తున్న సామర్థ్యాలకు ఒక ఉదాహరణ అని అన్నారు. ఇక్కడ దాదాపు 100 దేశాలు ఉండడం వల్ల భారత్‌పై ప్రపంచానికి నమ్మకం పెరిగిందని చెప్పవచ్చని పేర్కొన్నారు. భారతదేశం, ప్రపంచం నుంచి 700 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారనీ.. గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిందని అన్నారు.