దేశ సమగ్ర ప్రగతికి దోహదపడే అంతరిక్ష రంగాన్ని మరింత విస్తరించాలని, అదే ఇస్రో లక్ష్యమని ఆ సంస్థ చైర్మన్ సోమనాథ్ అన్నారు. మరిన్ని గ్రహాంతర మిషన్ లను నిర్వహించగలిగే సామర్థ్యం ఇస్రోకు ఉందని అన్నారు. చంద్రయాన్ -3 విజయం తరువాత ఆయన కేరళ రాజధాని తిరువనంతపురం చేరుకొని, మీడియాతో మాట్లాడారు. 

ఇప్పటికే చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపిన భారత్.. మరి కొన్ని రోజుల్లో సూర్యుడిని అన్వేషించడానికి సిద్ధమవుతోంది. దీని కోసం ఇస్రో ఆదిత్య ఎల్ -1 అనే పేరుతో ప్రయోగం చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే దీనిని ఎప్పుడు లాంచ్ చేస్తారనే విషయంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ కీలక అప్ డేట్ చేశారు. చంద్రయాన్ -3 విజయవంతం అయిన తరువాత ఆయన మొదటి సారిగా కేరళకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తిరువనంతపురంలో మీడియాలో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. 

అంతరిక్ష రంగంలో భారత్ సామర్థ్యంపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశం మరిన్ని గ్రహాంతర మిషన్ లను నిర్వహించగలుతుందని చెప్పారు. దేశ సమగ్ర పురోగతియే అంతరిక్ష సంస్థ లక్ష్యమని అన్నారు. దేశ అంతరిక్ష రంగంపై ప్రధాని నరేంద్ర మోడీకి దీర్ఘకాలిక విజన్ ఉందని, దాన్ని అమలు చేసేందుకు ఇస్రో సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. 

Scroll to load tweet…

‘‘చంద్రయాన్ -3 మిషన్ లో సాఫ్ట్ ల్యాండింగ్ మాత్రమే కాదు, చంద్రయాన్-3లోని మొత్తం అంశాలు 100 శాతం విజయవంతమయ్యాయి. యావత్ దేశం గర్విస్తోందని, తమకు మద్దతు ఇస్తోంది’’ అని అన్నారు. ఇస్రో సాధించిన విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆయన భవిష్యత్ ప్రయత్నాలకు ప్రజలు తమ మద్దతును కొనసాగించాలని కోరారు. చంద్రుడు, అంగారక గ్రహం, శుక్ర గ్రహాలపైకి మనం ఎక్కువగా ప్రయాణించగలుగుతామని, కానీ దాని కోసం మనం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని అన్నారు. అంతే కాకుండా మరిన్ని పెట్టుబడులు కూడా రావాల్సి ఉందని అన్నారు. దేశ సమగ్ర ప్రగతికి దోహదపడే అంతరిక్ష రంగాన్ని మరింత విస్తరించాలని, అదే ఇస్రో లక్ష్యమని సోమనాథ్ పేర్కొన్నారు. 

కాగా.. సూర్యుడిని అధ్యయనం చేసిన మొట్టమొదటి అంతరిక్ష ఆధారిత భారతీయ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్ 1 గురించి మీడియా ఆయనను ప్రశ్నించినప్పుడు.. ఉపగ్రహం సిద్ధంగా ఉందని, శ్రీహరికోటకు చేరుకుందని ఇస్రో చీఫ్ చెప్పారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఆదిత్య-ఎల్1 లాంచ్ అయ్యే అవకాశం ఉందని, త్వరలోనే తుది తేదీని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ ప్రయోగం తరువాత భూమి నుంచి లాగ్రాంజ్ పాయింట్ 1 (ఎల్ 1)కు చేరుకోవడానికి 125 రోజులు పడుతుందని, అప్పటి వరకు వేచి చూడాల్సిందే అని తెలిపారు. 

చంద్రయాన్-3లోని రోవర్, ల్యాండర్ రెండూ ఫొటోలు తీశాయని, రాబోయే రోజుల్లో మరిన్ని నాణ్యమైన చిత్రాల కోసం ఇస్రో బృందం ఎదురు చూస్తోందని తెలిపారు. ప్రస్తుతానికి చంద్రుడిపై శాస్త్రీయ అధ్యయనాలు, పరిశోధనలపై ఇస్రో బృందం ఎక్కువ దృష్టి సారించిందని ఆయన తెలిపారు. 

ఇదిలా ఉండగా.. రెండు దేశాల పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ శనివారం భారత్ కు చేరుకున్నారు. నేరుగా బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి చేరుకొని శాస్త్రవేత్తలను అభినందించారు. చంద్రయాన్ -3 విజయం సాధించినందుకు సోమనాథ్ ను వెన్నుతట్టారు. అనంతరం శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. చంద్రయాన్-3 చంద్రుడిని తాకిన ప్రదేశానికి 'శివశక్తి పాయింట్'గా, 2019లో చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-2 కూలిన ప్రదేశానికి 'తిరంగా పాయింట్' అని నామకరణం చేయనున్నట్లు ప్రకటించారు.