ప్రభాస్, కృతి సనన్ నటించిన ఆదిపురుష్ చిత్రంపై వివాదాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రానికి డైలాగ్ రైటర్ గా పని చేసిన మనోజ్ ముంతాషీర్ కు బెదిరింపులు వస్తున్నాయి. ఆయన అభ్యర్థన మేరకు ఆయన ముంబై పోలీసులు భద్రత కల్పించారు.
ఆదిపురుష్ ప్రారంభమైనప్పటి నుంచి వివాదాలను ఎదుర్కొంటుంది. స్టార్ల లుక్స్, వీఎఫ్‌ఎక్స్ విషయంలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో హీరోయిన్ కృతి సనన్‌తో పాటు, సైఫ్ అలీ ఖాన్, దర్శకుడు ఓం రౌత్ , 'ఆదిపురుష్' డైలాగ్స్ రైటర్ మనోజ్ ముంతాషిర్ లకు సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయి.
విడుదల తర్వాత ఈ సినిమాపై మరింత వివాదం పెరిగింది. అయోధ్యలోని సాధువులు ఆదిపురుషుని నిషేధించాలని డిమాండ్ చేయగా, పాల్ఘర్‌లో జరుగుతున్న సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. ఇప్పుడు ఆదిపురుష్ వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని ముంబై పోలీసులు మనోజ్ ముంతాషీర్‌కు భద్రత కల్పించారు.
ప్రభాస్, కృతి సనన్ నటించిన 'ఆదిపురుష్' చిత్రంపై పెరుగుతున్న వివాదాల మధ్య రైటర్ మనోజ్ ముంతషీర్ తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ ముంబై పోలీసుల నుండి రక్షణ కోరాడు. దీనిపై ముంబై పోలీసులు పలు చర్చల తర్వాత.. ఆయనకు భద్రత కల్పించారు. వార్తా సంస్థ ANIలో ప్రచురించిన నివేదికల ప్రకారం.. 'ఆదిపురుష్ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్‌కు ముంబై పోలీసులు భద్రత కల్పించారు, ముంబై పోలీసులు కూడా ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
"ఇతరుల మనోభావాలను కించపరిచే హక్కు ఎవరికీ లేదు"
సినిమాలో రాసిన డైలాగులపై బీజేపీ నేత, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. నేపాల్‌లో సినిమాపై నిషేధం విధించడం, పలు సినిమా థియేటర్లలో సినిమాకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తడంపై ఆయన స్పందిస్తూ.. ‘‘సీబీఎఫ్‌సీ దీనిపై నిర్ణయం తీసుకుంది. ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యొక్క విధి. ఈ సినిమా డైలాగ్స్‌ని మార్చడం గురించి నిర్మాత-దర్శకుడు, రచయిత కూడా మాట్లాడారు. ఎవరి మనోభావాలను కించపరిచే హక్కు ఎవరికీ లేదు".. ఈ సినిమాలో హనుమాన్ జీ మాట్లాడిన డైలాగ్స్ సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి.
