Asianet News TeluguAsianet News Telugu

హిమాచల్‌లో అదానీ విల్మర్ యూనిట్‌పై అధికారుల సోదాలు.. ఎలాంటి అవతవకలు కనుగొనలేదన్న కంపెనీ..

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్, పన్నుల శాఖ అధికారులు బుధవారం రాత్రి సోలన్ జిల్లాలోని పర్వానూలోని అదానీ గ్రూప్‌కు చెందిన యూనిట్‌పై దాడి చేశారు. 

Adani Wilmar on raids at their Himachal Pradesh unit says No irregularities found
Author
First Published Feb 9, 2023, 2:51 PM IST

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్, పన్నుల శాఖ అధికారులు బుధవారం రాత్రి సోలన్ జిల్లాలోని పర్వానూలోని అదానీ గ్రూప్‌కు చెందిన యూనిట్‌పై దాడి చేశారు. రాష్ట్ర శాఖ అధికారులు అదానీ విల్మార్ కంపెనీకి చెందిన క్యారీయింగ్ అండ్ ఫార్వర్డ్ యూనిట్‌ను తనిఖీ చేశారు. ఈ తనిఖీలకు సంబంధించి అదానీ విల్మర్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది అధికారులు నిర్వహించిన సాధారణ తనిఖీ అని.. దాడి చేయడం కాదని పేర్కొంది. కంపెనీ నిర్వహించిన కార్యకలాపాలు, లావాదేవీలలో అధికారులు ఎటువంటి అవకతవకలను కనుగొనలేదని తెలిపింది. 

తమ కార్యకలాపాలన్నీ సంబంధిత చట్టాలు మరియు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. ‘‘“మేము బాధ్యతాయుతంగా, పారదర్శకంగా వ్యాపారాన్ని నిర్వహించడానికి కట్టుబడి ఉన్నాం. మా కార్యకలాపాలన్నీ సంబంధిత చట్టాలు, నిబంధనలకు పూర్తిగా అనుగుణంగా ఉంటాయి. అధికారుల సందర్శన తర్వాత తమ కార్యకలాపాలు సాధారణంగానే పనిచేస్తున్నాయని మేము చెప్పదలుచుకున్నాం’’ అని అదానీ విల్మర్ ప్రకటనలో పేర్కొంది. 

అసలేం జరిగిందంటే.. బుధవారం రోజున హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్, పన్నుల శాఖ రాష్ట్రంలోని అదానీ విల్మార్ స్టోర్‌పై దాడి చేసి అర్థరాత్రి వరకు గోడౌన్‌లోని పత్రాలను తనిఖీ చేసింది. ఎక్సైజ్ శాఖ సౌత్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జోన్ బృందం ఈ సోదాలు నిర్వహించింది. అయితే అదానీ విల్మార్ కంపెనీ అనేక సంవత్సరాలుగా జీఎస్టీ సేకరణను డిపాజిట్ చేయడంలో విఫలమైన తర్వాత ఈ తనిఖీ జరిగిందనే వార్తలు వచ్చాయి. మరోవైపు ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో అదానీ విల్మర్ యూనిట్‌లో రాష్ట్ర అధికారులు సోదాలు నిర్వహించడం కూడా హాట్ టాపిక్‌గా మారింది. 

ఈ క్రమంలోనే స్పందించిన అదానీ విల్మార్ కంపెనీ.. అలాంటిదేమి లేదని స్పష్టం చేసింది.  ఇక, అదానీ విల్మార్ వ్యాపార సమ్మేళనం అనేది అదానీ గ్రూప్, సింగపూర్‌కు చెందిన విల్మార్ మధ్య 50:50 జాయింట్ వెంచర్. 

Follow Us:
Download App:
  • android
  • ios