అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.రెగ్యులేటరీ పాలనను సమీక్షించడానికి నిపుణుల కమిటీ ఏర్పాటుకు సంబంధించి సుప్రీం కోర్టు సూచనకు కేంద్రం అంగీకరించింది.

అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. అదానీ గ్రూప్‌పై హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికలో చేసిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో కమిటీని ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు విచారణ సందర్భంగా.. .రెగ్యులేటరీ మెకానిజంను సమీక్షించడానికి నిపుణుల కమిటీ ఏర్పాటుకు సుప్రీం కోర్టు సూచనకు కేంద్రం అంగీకరించింది. 

కేంద్రం తరఫున వాదనల వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా..రెగ్యులేటరీ మెకానిజంను బలోపేతం చేసేందుకు నిపుణుల ప్యానెల్‌ను ఏర్పాటు చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. అయితే విదేశీ పెట్టుబడులపై ప్రభావం పడకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుందన్నారు. 

భవిష్యత్తులో పెట్టుబడిదారులకు రక్షణ ఎలా ఉంటుందో సూచించడానికి ఒక కమిటీని నియమించడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని సొలిసిటర్ జనరల్ తెలిపారు. పరిస్థితిని ఎదుర్కోవటానికి సెబీ సమర్థంగా ఉందని అన్నారు. ఈ క్రమంలోనే స్పందించిన సుప్రీం కోర్టు.. క‌మిటీ నిర్వ‌హ‌ణ గురించి చెప్పాల‌ని కేంద్రాన్ని కోరింది. ప్రతిపాదిత విధివిధానాలపై బుధవారంలోగా నోట్‌ సమర్పించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. ఇక, గత విచారణలో ఇన్వెస్టర్ల సొమ్మును నష్టపోవడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి నష్టాల నుంచి ప్రజలను కాపాడేందుకు వ్యవస్థను సంస్కరించాలని కోర్టు సూచించింది.

ఇక, వివ‌రాల్లోకెళ్తే.. గౌత‌మ్ అదానీ సంస్థలపై హిండెన్ బర్గ్ నివేదిక నేప‌థ్యంలో దేశంలో రాజ‌కీయ ర‌చ్చ కొన‌సాగుతోంది. షేర్ మార్కెట్ సైతం ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న పార్లమెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌తిప‌క్ష పార్టీలు దీనిపై విచార‌ణ జ‌రిపించ‌డానికి జేపీసీ ఏర్పాటు చేయాలంటూ ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే అదానీ సంస్థలపై హిండెన్ బర్గ్ నివేదికపై విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.