హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ షేర్ల పతనం నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా నియంత్రణ వ్యవస్థ బలోపేతానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది.
హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ షేర్ల పతనం నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా నియంత్రణ వ్యవస్థ బలోపేతానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ కమిటీలో సభ్యులుగా ఓపీ భట్, కేవీ కామత్, జస్టిస్ కేపీ దేవదత్, నందన్ నీలేకని, సోమశేఖర్ సుందరేశన్ ఉండనున్నారు. కమిటీని ఏర్పాటు చేయడం నియంత్రణ సంస్థలపై ప్రతికూల ప్రతిబింబం కాదని కూడా ఎస్సీ స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ ఇటీవలి కాలంలో సెక్యూరిటీల మార్కెట్‌లో అస్థిరతకు దారితీసిన అంశాలతో సహా మొత్తం పరిస్థితిని అంచనా వేస్తుందని.. పెట్టుబడిదారుల అవగాహనను బలోపేతం చేయడానికి చర్యలను సూచిస్తుందని పేర్కొంది.
సెక్యూరిటీ రెగ్యులేషన్ నిబంధనలను ఉల్లంఘించడం, స్టాక్ ప్రైసింగ్‌లో తారుమారు జరిగిందా అనే దానిపై సెబీ దర్యాప్తు చేస్తుందని సుప్రీం కోర్టు తెలిపింది. సెక్యురిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ రూల్స్‌లోని రూల్ 19(ఎ)ని ఉల్లంఘించారా?, సంబంధిత పార్టీలతో లావాదేవీలను బహిర్గతం చేయడంలో విఫలమయ్యారా? అనే దానిపై విచారణ జరపాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సెబీని కోరింది. సెబీ త్వరితగతిన విచారణను ముగించాలని తెలిపింది. సెబీ 2 నెలల్లోగా విచారణను ముగించి నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ఆదేశించింది.
ఇక, అదానీ గ్రూప్‌పై హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత ఆ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్ల నియంత్రణ చర్యల్ని బలోపేతం చేయాలని కోరుతూ పిటిషన్‌లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దీవాలాల ధర్మాసనం.. నియంత్రణ వ్యవస్థ బలోపేతానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ క్రమంలోనే కమిటీ ఏర్పాటకు కేంద్రం సీల్డ్ కవర్‌లో పేర్లను సమర్పించింది.
అయితే కేంద్రం సీల్డ్ కవర్‌లో సమర్పించిన పేర్లను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. విచారణ పాదర్శకంగా ఉండాలని పేర్కొంది. నియంత్రణ వ్యవస్థ బలోపేతానికి నిపుణుల కమిటీని తామే ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ క్రమంలోనే తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి.
