Asianet News TeluguAsianet News Telugu

అదానీ, అంబానీ అందరినీ కొనేశారు.. నా అన్నను ఎప్పటికీ కొనలేరు: ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. అదానీ, అంబానీ అందరినీ కొన్నారని.. కానీ తన అన్నయ్య రాహుల్ గాంధీని ఎప్పటికీ కొనలేరని అన్నారు.

Adani and Ambani bought everyone but can never buy my brother says Priyanka Gandhi
Author
First Published Jan 3, 2023, 3:29 PM IST

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. అదానీ, అంబానీ అందరినీ కొన్నారని.. కానీ తన అన్నయ్య రాహుల్ గాంధీని ఎప్పటికీ కొనలేరని అన్నారు. తన అన్న సత్యం కోసం నిలబడతారని చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 9 రోజుల విరామం తర్వాత ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ నుంచి రాహుల్ గాంధీ తన పాదయాత్రను ప్రారంభించారు. అంతకుముందు ఈరోజు ఉదయం రాహుల్ గాంధీ ఢిల్లీలోని యమునా బజార్ ప్రాంతంలోని హనుమాన్ మందిర్‌ను సందర్శించారు. అనంతరం యాత్రను ప్రారంభించారు. రాహుల్ యాత్ర ఈ రోజు మధ్యాహ్నం బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించింది. 

ఉత్తరప్రదేశ్‌లో ఎంటర్ అవుతున్న రాహుల్ గాంధీకి లోనీ సరిహద్దు వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ప్రియాంక గాంధీ స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. తన అన్నయ్యను చూసి గర్వపడుతున్నానని చెప్పారు.  ‘‘యూపీలో భారత్ జోడో యాత్రకు స్వాగతం పలకడం నాకు సంతోషంగా ఉంది. 3,000 కి.మీ పాదయాత్ర తర్వాత.. భారత్ జోడో యాత్ర ఇక్కడకు చేరుకుంది. ప్రియమైన అన్నయ్య.. నేను నీ గురించి చాలా గర్వపడుతున్నాను. మీకు వ్యతిరేకంగా అన్ని శక్తులను ప్రయోగించారు’’ అని అన్నారు. 

Also Read: 9 రోజుల విరామం తర్వాత భారత్ జోడో యాత్ర పునఃప్రారంభం.. ఈ రోజు యూపీలోకి రాహుల్ ఎంట్రీ..

అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీలను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు గుప్పించారు. వారు అగ్ర నాయకులను కొనుగోలు చేశారు, ప్రభుత్వ రంగ యూనిట్లను కొనుగోలు చేయగలిగారు, మీడియాను కొనుగోలు చేశారు.. కానీ తన అన్నను మాత్రం వారు కొనుగోలు చేయలేకపోయారని అన్నారు.  తన అన్న సత్యం కోసం నిలబడతాడని.. అందుకే అది వారి వల్ల అయ్యే పని కాదని అన్నారు. 

ప్రభుత్వం తన శక్తిని ఉపయోగించుకుని రాహుల్ ప్రతిష్టను నాశనం చేయడానికి కోట్లు ఖర్చు చేసిందని ప్రియాంక ఆరోపించారు. రాహుల్ యోధుడని.. సత్య మార్గం నుంచి ఆయనను దూరం చేయలేరని అన్నారు. సత్యం అనే కవచాన్ని ధరించడం వల్ల రాహుల్ గాంధీకి చలిగా అనిపించడం లేదని చెప్పారు. అదే సమయంలో బీజేపీ దేశంలో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తుందని ఆరోపించిన రాహుల్ గాంధీ మాటలను ప్రియాంక గాంధీ ప్రస్తావించారు. ‘‘ప్రేమను ప్రతిచోటా విక్రయించడానికి మనం దుకాణాలు తెరవాలి’’ అని అన్నారు. 

ఇక, సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర యాత్ర ఇప్పటివరకు తొమ్మిది రాష్ట్రాల్లో సాగింది. జనవరి చివరి నాటికి రాహుల్ యాత్ర జమ్మూ కాశ్మీర్‌లో ముగియనుంది. రాహుల్ యాత్ర ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక,  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానాలోని తొమ్మిది రాష్ట్రాల్లోని 46 జిల్లాల్లో దాదాపు 3,000 కిలోమీటర్ల మేర సాగింది. డిసెంబర్ 24న రాహుల్ పాదయాత్ర ఢిల్లీలోకి ప్రవేశించింది. అదే రోజు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన సమావేశం అనంతరం.. యాత్రకు తొమ్మిది రోజుల విరామం తీసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios