తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నటుల రాజకీయ ప్రవేశం ఊపందుకుంటోంది. ఇప్పటికే కమల్‌హాసన్‌ రాజకీయ పార్టీని ప్రారంభించారు. రజనీకాంత్ ఇవ్వాలో, రేపో పార్టీ ప్రకటిస్తారు. తాజాగా మరో నటుడు విజయ్ కూడా రాజకీయ ప్రవేశం చేయనున్నట్టుగా తెలుస్తోంది. 

నటుడు విజయ్‌ తన అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపాడు. రాజకీయ ప్రవేశంపై ఇన్నాళ్లు నోరు మెదపని విజయ్, ఆదివారం తమ అభిమానులను సంతృప్తిపరిచే ప్రకటన చేశారు. తన రాజకీయ రంగప్రవేశం ఆలస్యంపైన అసంతృప్తితో ఉన్న అభిమానులెవ్వరూ ఇతర పార్టీల్లోకి వెళ్లొద్దని, తన అభిమాన సంఘం ‘మక్కల్‌ ఇయక్కం’ నుంచి తప్పుకోవద్దని విజ్ఞప్తి చేశారు. 

‘ఎంతో సహనంతో ఇన్నేళ్లుగా ఎదురు చూసిన మీ కల సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. ఎవ్వరూ అధైర్యపడొద్దు’ అని మెసేజ్ పంపారు. చెన్నై శివారు పనయూరులోని ఫాంహౌస్ లో ఆదివారం మక్కల్‌ ఇయక్కం నేతలు, అభిమానులతో విజయ్‌ సమావేశమయ్యారు. అసంతృప్తితో ఉన్న అభిమాన సంఘాల నేతలను పిలిపించి బుజ్జగించారు. 

మొదటి నుంచి సామాజిక స్పృహ ఉన్న నటుడు విజయ్‌ రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శిస్తూ వస్తున్నారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి రానున్నారంటూ అభిమానులు దశాబ్దం క్రితమే సంబరాలు చేసుకున్నారు.

అయితే అదిగో ఇదిగో అంటూ కాలం వెళ్లబుచ్చుతున్న విజయ్‌.. అభిమాన సంఘాలను ‘మక్కల్‌ ఇయక్కం’ గా మార్చి దాని ద్వారా ఏటా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లోకి రావడం విజయ్‌కి ఇష్టంలేదని అభిమానులు భావిస్తున్న సమయంలో తాజా ప్రకటన వారిలో ఉత్సాహం రేపుతోంది.