Sonu Sood : భార‌తీయ ప్ర‌ముఖ సినీ న‌టుడు సోనూ సూద్‌పై కేసు న‌మోదైంది. పంజాబ్‌లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించార‌ని పేర్కొంటూ పోలీసులు ఆయ‌న‌పై కేసు న‌మోదుచేశారు.  

Sonu Sood: అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌తో పాటు రాష్ట్రంలోని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల మ‌ధ్య నువ్వా-నేనా అనే విధంగా అసెంబ్లీ ఎన్నిక‌ల పోరు కొన‌సాగిన పంజాబ్ లో ఆదివారం పోలింగ్ (Punjab Assembly Election 2022) ముగిసింది. పంజాబ్ లో ఎన్నిక‌ల సంద‌ర్భంగా అక్క‌డి రాజ‌కీయాలు స‌ర‌వ‌త్త‌రంగా మారాయి. ఈ క్ర‌మంలోనే భార‌తీయ ప్ర‌ముఖ సినీ న‌టుడు సోనూ సూద్‌పై కేసు న‌మోదైంది. పంజాబ్‌లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించార‌ని పేర్కొంటూ పోలీసులు ఆయ‌న‌పై కేసు న‌మోదుచేశారు. వివ‌రాల్లోకెళ్తే.. న‌టుడు సోనూసూద్ ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేస్తున్నార‌ని ఫిర్యాదులు అందాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌నను మోగాలోని పోలింగ్ స్టేష‌న్‌ను సంద‌ర్శంచ‌కుండా ఎన్నిక‌ల సంఘం నిషేధం విధించింది. అయితే, ఎన్నిక‌ల మోడ‌ల్‌ ప్రవర్తనా నియమావళికి సంబంధించి మోగా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలను ఉల్లంఘించినందుకు నటుడు సోనూ సూద్‌ (Sonu Sood) పై పోలీసులు కేసు నమోదు చేశారు. పంజాబ్‌లోని మోగా (Moga) జిల్లాలో ఆదివారం భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 188 కింద సోనూసూద్‌పై కేసు నమోదైందని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. 

కాగా, 117 మంది సభ్యులున్న పంజాబ్ అసెంబ్లీకి ఆదివారం పోలింగ్ జరిగింది. ఇటీవ‌లే సోనూసూద్ సోద‌రి కాంగ్రెస్ (Congress )పార్టీలో చేరారు. మాళవికా సూద్ సచార్ మోగా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు. ఈ క్ర‌మంలోనే ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేస్తున్నార‌ని ఫిర్యాదులు అంద‌డంతో మోగా నియోజకవర్గంలో లంధేకే గ్రామం పోలింగ్ కేంద్రాలను సందర్శించేందుకు వెళ్తున్న సోనూ సూద్‌ను ఎన్నికల కమిషన్ (EC) అడ్డుకుంది. మాళవికా సూద్ సచార్ పోటీ చేస్తున్న పంజాబ్ లోని మోగా అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల‌ను పరిశీలించేందుకు అక్క‌డ వెళ్లారు. సోనూసూద్‌. ఐతే పోలింగ్‌ బూత్‌లోకి ఇతరులకు ఎంట్రీ లేదంటూ అడ్డుకున్నారు. ఆయన ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయనను పోలింగ్ కేంద్రాలకు వెళ్ళవద్దని ఆదేశించింది. ఆయన కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఎన్నికల పరిశీలకుల సూచన మేరకు వాహనాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, SDM-కమ్-రిటర్నింగ్ అధికారి సత్వంత్ సింగ్ కూడా సోనూ సూద్ ఇంటిపై వీడియో నిఘాను ఆదేశించారు. సత్వంత్ సింగ్ మాట్లాడుతూ.. “సోనూ సూద్‌కు మోగా నియోజకవర్గంలో ఓటు హ‌క్కు లేనందున ఆ ప్రాంతంలోకి వెళ్లడానికి అనుమతించలేద‌నీ, అతని ఇంట్లోనే ఉండాలని ఆదేశించమ‌ని. అయితే.. ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించాడనీ, అందువల్ల, అతని ఇంటిపై వీడియో నిఘా ఉంచాల‌ని ఆదేశించిన‌ట్టు తెలిపారు. ఇక మోగా పోలీస్ స్టేషన్ (సిటీ)లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం.. మిస్టర్ సూద్ మోగాలోని లాండెకే గ్రామంలో తన సోదరి కోసం ప్రచారం చేస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. గ్రామంలో వాహనంలో కూర్చున్నట్లు గుర్తించారు. అలా చేయడం ద్వారా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలను ఉల్లంఘించారని పేర్కొంది. మోగా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చరణ్‌జిత్ సింగ్ సోహల్ సోమవారం మాట్లాడుతూ మిస్టర్ సూద్ అక్కడ ఉండాల్సిన అవసరం లేదనీ, అందుకే అతనిపై చర్య తీసుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే సోనూసూద్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది.