సినీ నటి రాధిక శరత్ కుమార్ తమిళనాడు ఎన్నికల బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. శరత్ కుమార్ ఆదేశిస్తే పోటీ చేస్తానని  ఆమె స్పష్టం చేశారు. ఇంతకాలం అన్నాడీఎంకే కూటమిలో ఉన్నామని, తమను కరివేపాకులా తీసిపారేశారని రాధిక ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన భర్త చాలా ధైర్య వంతుడని, ఈ ఎన్నికల్లో తమ ఎస్ఎమ్‌కే పార్టీ బలమెంతో నిరూపిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. చెన్నైలోనే వేలాచ్చేరి లేదా దక్షిణ తమిళనాడులోని ఉసిలంపట్టి స్థానాల నుంచి రాధిక పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు తమిళనాడు ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై ఎస్ఎమ్‌కే పార్టీ అధినేత శరత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్‌తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని ఆయన తెలిపారు.

కూటమి తరపున పోటీ చేసే స్థానాలపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని శరత్ కుమార్ పేర్కొన్నారు. తమను థర్డ్ ఫ్రంట్ అంటున్నారని, కానీ తమదే ఫస్ట్ ఫ్రంట్ అని ఆయన స్పష్టం చేశారు.

కాగా శరత్ కుమార్, రాధిక తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. వీరిద్దరూ ఎన్నో తెలుగు సినిమాల్లో నటించారు. తెలుగు నాట అగ్రహీరోల సరసన రాధిక నటించారు.

మెగాస్టార్ చిరంజీవితో అత్యధిక సినిమాల్లో రాధిక జోడీ కట్టారు. ఇక శరత్ కుమార్ సైతం చిరంజీవితో నటించారు. ‘గ్యాండ్ లీడర్’ చిత్రం‌లో మెగాస్టార్‌కి అన్నయ్యగా, ‘బన్ని‘ సినిమాలో అల్లు అర్జున్‌కు తండ్రిగా నటించారు.