ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ భారత్‌లోనూ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే కేసుల సంఖ్య 200 దాటింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది. 

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ (omicron) భారత్‌లోనూ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే కేసుల సంఖ్య 200 దాటింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది. డెల్టా రకంతో పోలిస్తే ఒమిక్రాన్ దాదాపు మూడు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొంది. అందువల్ల దూరదృష్టితో వ్యవహరించి డేటాని సమగ్రంగా విశ్లేషించాలని, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ (ministry of health and family welfare) కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ (rajesh bhushan) రాష్ట్రాలకు సూచించారు. 

ఒమిక్రాన్‌ని నియంత్రించేందుకు తక్షణమే వార్‌రూమ్‌లను యాక్టివేట్‌ చేయాలని ఆయన కోరారు. దేశంలోని పలు ప్రాంతాల్లో డెల్టా రకం కేసులు ఇంకా నమోదవుతున్నట్టు రాజేశ్ భూషణ్ చెప్పారు. జిల్లాల వారీగా రాష్ట్రాలు ఎక్కడికక్కడ కఠిన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అవసరమైతే నైట్‌ కర్ఫ్యూలు విధించడం, భారీ జనసమూహాలను నియంత్రించడం, కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను తగ్గించడం, ప్రజా రవాణాపై ఆంక్షలు వంటి చర్యలపై యోచించాలని రాజేశ్ భూషణ్ కోరారు. వీటీతో పాటు ఆస్పత్రుల్లో పడకలు, అంబులెన్సులు, ఆక్సిజన్‌ పరికరాలు, ఔషధాలు వంటి సౌకర్యాల మెరుగుదలకు అత్యవసర నిధులు వినియోగించుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్‌‌ను మరింత వేగవంతం చేయాలని రాజేశ్ భూషణ్ చెప్పారు.

ALso Read:హైదరాబాద్‌: ఆసుపత్రిలో కలకలం.. రోగికి వైద్యం చేసిన డాక్టర్‌కు కూడా ఒమిక్రాన్

మరోవైపు కొత్తగా మహారాష్ట్రలో 11, తెలంగాణలో నాలుగు ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 215కి చేరుకుంది. ఇప్పటివరకు దేశంలోని 12 రాష్ట్రాలకు ఒమిక్రాన్‌ వేరియంట్ విస్తరించగా.. మహారాష్ట్ర (65), ఢిల్లీ (54), తెలంగాణ (24) లు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. తర్వాత కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14 కేసులు వున్నాయి. ఒమిక్రాన్ బారినపడిన వారిలో ఇప్పటివరకు 77 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.