పంజాబ్ లో కరోనాతో ఏసీపీ మృతి: భార్యకు కూడా కరోనా పాజిటివ్
పంజాబ్ లోని లూథియానాలో కరోనా వైరస్ తో ఏసీపీ మరణించారు. ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అంతేకాకుండా ఆయన వాహనం డ్రైవర్ కు కరోనా వైరస్ సోకింది.
న్యూఢిల్లీ: పంజాబ్ లోని లూథియానాకు చెందిన సీనియర్ పోలీసు అధికారి కరోనా వైరస్ వ్యాధితో మరణించాడు. పలు అవయవాలు దెబ్బ తినడంతో ఆయన మరణించారు. అసిస్టెంట్ పోలీసు కమీషనర్ (ఏసీపీ) అనిల్ కుమార్ కోహ్లీ (52)కి ప్లాస్మా సర్జరీ చేయాలని తలపెట్టారు. అయితే దానికి ముందే ఆయన మరణించారు.
అంతకు ముందు ఆయనను లూథియానాలోని ఎస్పీఎస్ ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు ప్లాస్మా థెరపీ చేయడానికి పంజాబ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్లాస్మా థెరపీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తొలి కేసు ఇదే. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.
స్టెషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్ హెచ్ఓ) అయిన ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కానిస్టేబుల్ అయిన ఆయన కారు డ్రైవర్ కు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన మృతి పంజాబ్ డీజీపీ ట్విట్టర్ ద్వారా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
లూథియానాలో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. పంజచాబ్ లో 200కు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 13 మంది కరోనా పాజిటివ్ వల్ల మరణించారు.