ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంపేస్తామని బెదిరించినట్టు ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసులో నిందితుడిని కోర్టు నిర్దోషిగా తేల్చింది. అతనిని ఈ కేసులో దోషిగా తేల్చడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైందని పేర్కొంది.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంపేస్తానని బెదిరించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న ఓ వ్యక్తి నిర్దోషిగా బయటపడ్డాడు. పోలీసు హెల్ప్‌లైన్ 100కు ఫోన్ చేసి నరేంద్ర మోడీని చంపేస్తానని బెదిరించినట్టు మొహమ్మద్ ముక్తార్ అలీపై కేసు నమోదైంది. 2019 జనవరిలో ఆ కాల్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అభ్యంతరకర భాషలో మాట్లాడిన ఆ వ్యక్తి నరేంద్ర మోడీని చంపేస్తానని బెదిరింపులు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలతో అతనిపై కేసు నమోదైంది. ఈ కేసులో అతడిని ఢిల్లీ కోర్టు నిర్దోషిగా తేల్చి వదిలిపెట్టింది.
మొహమ్మద్ ముక్తార్ అలీపై ఐపీసీలోని సెక్షన్ 506 (2) కింద ఆనంద్ పర్భాత్ పోలీసు చార్జిషీట్ ఫైల్ చేశారు. ఈ అభియోగాలను బలపరిచే కీలక ఆధారాలు చేతితో రాసిన జనరల్ డైరీ ఎంట్రీ, పీసీఆర్ ఫామ్ అని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శుభం దేవాడియా తెలిపారు. అయితే, పీసీఆర్ ఫామ్ కలెక్షన్ లేకపోవడంపై ఏఎస్ఐ సరైన వివరణ ఇవ్వలేదని వివరించారు. ఆ రోజు అతను కాల్ చేసినప్పుడు అందులో ఏం మాట్లాడారో ఎగ్జాక్ట్ కాన్వర్జేషన్‌ను పేర్కొనలేదని తెలిపారు. ఆ ఫామ్ లేకపోవడం మూలంగా జీడీ ఎంట్రీని పరిగణనలోకి తీసుకోలేమని పేర్కొన్నారు.
Also Read: వీధి కుక్కలను అసోంకు పంపండి.. అక్కడ మంచి డిమాండ్ ఉన్నది: మహా ఎమ్మెల్యే సూచన వివాదాస్పదం
ఈ బెదిరింపు కాల్ వచ్చిన నెంబర్ సురద్ అలీ అనే వ్యక్తి పేరిట ఉన్నదని, కానీ, ఆ వ్యక్తి పాత్రపైనా దర్యాప్తు జరపలేదని, అతడిని తాము పట్టుకోలేకపోయామని మాత్రమే ఏఎస్ఐ చెప్పారని వివరించారు.
కాబట్టి, చంపేస్తామనే బెదిరింపులకు సంబంధించి కచ్చితమైన ఆధారాలను సేకరించడంలో ప్రాసిక్యూషన్ దారుణంగా విఫలమైందని మెజిస్ట్రేట్ దేవాడియా గత నెల పాస్ చేసిన ఆర్డర్‌లో పేర్కొన్నారు. నిందితుడే దోషి అని నిస్సందేహంగా నిరూపించడంలో విఫలమైందని, కాబట్టి, నిందితుడు నిర్దోషి అని స్పష్టం చేశారు. నిందితుడి నుంచి కనీసం సిమ్ కార్డు కూడా స్వాధీనం చేసుకున్నట్టు సీజర్ రిపోర్టు పేర్కొనలేదని, విట్నెస్‌నూ సేకరించడంలో కృషి లేదని తెలుస్తున్నదని వివరించారు. క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి ఎవరినీ ఈ దర్యాప్తులో చేర్చుకోవడానికి ఎలాంటి నోటీసులూ ఎవరికీ పంపలేదని ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ అంగీకరించారు. అసలు నిందితుడు ఎందుకు బెదిరించాడు? అతని ఉద్దేశం ఏమిటనేది కూడా ప్రాసిక్యూషన్ చూపెట్టలేకపోయిందని అన్నారు.
