కోజికోడ్: ఐస్ క్రీంలో విషం కలిపి చెల్లెలిని చంపిన యువకుడు పెద్ద పథకమే వేశాడు. ఆ కేసును పోలీసులు ఛేదించారు. తన కుటుంబ సభ్యులందరినీ చంపేసి, మొత్తం ఆస్తిని కాజేసి, ప్రేయసితో విలాస జీవితం గడపాలని 22 ఏళ్ల యువకుడు పథక రచన చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. 

విషం కలిపి ఇచ్చిన ఐస్ క్రీం తిని యువకుడి 16 ఏళ్ల వయస్సు గల చెల్లెలు మరణించింది. అతని తండ్రి మృత్యువుతో పోరాడుతున్నాడు. కేరళలోని వెల్లరికుందు పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. నిందితుడు అల్బిన్ బెన్నిని పోలీసులు అరెస్టు చేసి విచారించడంతో అసలు విషయం బయటపడింది. 

అతని తల్లి కొద్దిగా మాత్రమే ఐస్ క్రీం తీనడంతో ప్రాణాలు దక్కించుకుంది. పోలీసులు తొలుత ఆమెను కూడా అనుమానించారు. అయితే, ఐస్ క్రీం రుచిలో తేడా ఉండడంతో ఆమె తినలేదని పోలీసు విచారణలో తేలింది. 

నిందితుడు అల్బిన్ కుటుంబ సభ్యులను చంపేసి, ఆస్తిని అమ్మేసి విలాసంగా జీవించేందుకు ఆ పనిచేసినట్లు తేలింది. కొన్ని నెలల ముందు నుంచే నిందితుడు కుట్ర చేశాడని, రెండు వారాల క్రితం చికెన్ కూరలో ఎలుకల మందు కలిపాడని, అయితే తక్కువ మోతాదులో కలపడం వల్ల ఎవరికీ ప్రమాదం జరగలేదని సీఐ ప్రేమ్ సదన్ తెలిపాడు. 

ఎలుకల మందు కోసం అతను గూగుల్ లో గాలించాడు. అతడి మొబైల్ లోని సెర్చ్ హిస్టరీ మొత్తాన్ని పోలీసులు రాబట్టారు. ఆ కుటుంబం గత నెల 30వ తేదీన ఐస్ క్రీం తయారు చేసింది. చెల్లెలు అన్నా మేరీ దాన్ని ఫ్రిజ్ లో పెట్టింది. దాన్ని కుటుంబ సభ్యులు తిన్నారు. కొద్దిగా చేదు అనిపించడంతో తల్లి మాత్రం రుచి చూసి వదిలేసింది. 

ఐస్ క్రీం చల్లగా ఉందంటూ అల్బిన్ తినలేదు. ఆగస్టు 1వ తేదిన అన్నా మేరీకి వాంతులు వచ్చాయి. దాంతో ఆమెను ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు.  అప్పటికే విషం ఎక్కి ఆమె కాలేయం దెబ్బ తింది. ఆమెకు హోమియోపతి, ఆయుర్వేద మందులు ఇచ్చారు. అయినా ఫలితం దక్కలేదు. ఈ నెల 5వ తేదీన పయన్నూర్ కోఆపరేటివ్ ఆస్పత్రి చేర్చారు. అదే రోజు ఆమె మృత్యువాత పడింది. 

మేరీకి కోవిడ్ పరీక్షలు నిర్వహించడానికి శాంపిల్స్ తీసుకుని వెళ్లేవరకు విషయం తెలియలేదు. ఆమె శరీరంలో విషం ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అల్బిన్ ఒక్కడికే ఏ విధమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దాంతో ఆధారాలు సేకరించేందుకు ఇంటిని సీల్ చేశారు. 

తన కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు అందరూ భావిస్తారని అల్బిన్ భావించాడు. నిందితుడు డ్రగ్స్ తీసుకుని కుటుంబ సభ్యులతో గొడవ పడినట్లుగా పోలీసులు తెలుసుకున్నారు. చివరకు నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.