లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రాకేష్ పాండేను యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం నాడు ఎన్ కౌంటర్ చేశారు. మృతుడిపై రూ. లక్ష రివార్డు ఉంది.  పాండే ఎన్ కౌంటర్ లో మరణించినట్టుగా  ఐజీ అమితాబ్ యష్ మీడియాకు తెలిపారు.

రాష్ట్రంలోని మావో జిల్లాకు చెందిన రాకేశ్ పాండే అలియాస్ హ‌నుమాన్ పాండే ఎన్నో నేరాల‌కు పాల్ప‌డ్డాడు. 2005లో న‌వంబ‌ర్ 29న బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద రాయ్‌తో పాటు మ‌రో 6 మందిని హ‌తమార్చిన కేసులో పాండే నిందితుడిగా ఉన్నాడు. 

ఈ కేసును సీబీఐ విచారించింది. 2013లో కృష్ణానంద రాయ్ భార్య అల్కా రాయ్‌ సుప్రీంకోర్టులో వేసిన పిటిష‌న్ మేర‌కు ఉన్న‌త‌ న్యాయ‌స్థానం ఈ కేసును ఘ‌జియాపూర్ నుంచి ఢిల్లీకి మార్చాల‌ని ఆదేశించిన విషయం తెలిసిందే.

ఇదే కేసులో పాండేకు అత్యంత సన్నిహితుడు గ్యాంగ్ స్టర్ నుండి రాజకీయ నాయకుడి అవతారం ఎత్తిన ముక్తర్ అన్సారీని కోర్టు నిర్ధోషిగా ప్రకటించడాన్ని కృష్ణానందరాయ్ భార్య అల్కారాయ్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. 

ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వాళ్లే వ్యతిరేకులుగా మారారని పేర్కొన్న సీబీఐ కోర్టు..వారిని నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో అల్కారాయ్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణలో ఉండగానే పాండే పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించాడు.