మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో ప్రమాద బాధితుడిని జేసీబీలో ఆసుపత్రికి తరలించినట్లు సోషల్ మీడియాలో వైరల్ వీడియో వైర‌ల్ అవుతున్నాయి. అంబులెన్స్ సమయానికి ఘటనా స్థలానికి చేరుకోకపోవడంతో జేసీబీలో బాధితుడిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి కాలు విరిగింది. అతడిని దవాఖానకు తరలించడానికి స్థానికులు అంబులెన్స్ కు ఫోన్‌ చేశారు. అంబులెన్స్‌ ఎంతకీ రావడం లేదు.. బాధితుడిని జేసీబీలో (JCB) ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లా బారాహీ అనే ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో మహేశ్‌ బర్మన్‌ అనే యువకుడి కాలు విరిగింది. స్థానికులు 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. అయితే స్థానికంగా అంబులెన్స్‌ అందుబాటులో లేదని, పక్కన ఉన్న మరో ఊరు నుంచి పంపిస్తామని చెప్పారు. గంటలు గడుస్తున్నాయి. ఎంతకీ అంబులెన్స్ రాలేదు. ప్రత్యామ్నాయం స్థానికులు మూడు నాలుగు ఆటోలను సహాయం అడిగారు.

కానీ, ఎవ్వరూ తమ ఆటోలో అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న డ్రైవ‌ర్ చూసి.. గాయ‌ప‌డిన వ్య‌క్తి తన జేసీబీలో ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌డానికి ముందుకు వ‌చ్చాడు. ఈ స‌మ‌యంలో కొందరూ వ్య‌క్తులు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. మధ్యప్రదేశ్‌లో వైద్య సౌకర్యాల లేమికి ఇది నిదర్శమని విమర్శలు సంధిస్తున్నారు నెటిజ‌న్లు.

అయితే.. రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. గత నెల నీమాచ్ జిల్లాలో భారీ వరదల కారణంగా అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకోకపోవడంతో గర్భిణీ స్త్రీని జేసీబీలో ఆసుపత్రికి తీసుకువెళుతున్నట్లు వార్త‌లు వ‌చ్చాయి. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో క‌నిపిస్తాయి. 


ఇదిలాఉంటే.. ఈ ఏడాది ఏప్రిల్‌లో జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల‌లో సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంబులెన్సుల సంఖ్య 1445 నుంచి 2052కు పెంచామ‌ని ప్ర‌కటించారు. అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్ట్‌ ఉన్న అంబులెన్సులు 75 నుంచి 167కు, బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌ ఉన్నవి 531 నుంచి 835కు పెరిగాయని ప్రకటించారు. అయితే రోగులు, వ్యాధిగ్రస్తులు, బాధితులకు సరైన సమయంలో అంబులెన్సులు అందుబాటులో లేని ఘటనలు రాష్ట్రంలో పెద్దసంఖ్యలో చోటుచేసుకున్నాయి.

Scroll to load tweet…