దేశంలోని అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ చోటు దక్కించుకున్నారు. అన్ని దేశాల ముఖ్యమంత్రులపై చేసిన సర్వేలో.. బెస్ట్ సీఎంల జాబితాలో జగన్ నిలిచారు.  ప్రముఖ జాతీయ వార్తా ఛానెల్ ఏబీపీ న్యూస్ ఆధ్వర్యంలో ఇటీవల దేశ్ కా మూడ్ పేరిట ఓ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో బెస్ట్ సీఎంలలో జగన్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.

తొలి రెండు స్థానాల్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉన్నారు. అత్యుత్తమ పాలన సామర్థ్యంతో, అన్ని వర్గాల ప్రజలకు ఆసరాగా నిలిచే సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ఈ ఘనత సాధించారు. ఈ ఏబీపీ న్యూస్‌ సర్వేలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రుల్లో మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ 8వ స్థానంలో, గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ 9వ స్థానంలో, గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ 10వ స్థానంలో నిలిచారు. ఏబీపీ–సీఓటర్‌ సంస్థ దేశ్‌ కా మూడ్‌ పేరుతో దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాల్లో గత 12 వారాల్లో 30 వేలకు పైగా ప్రజలను అడిగిన వివిధ ప్రశ్నల ఆధారంగా సర్వేను రూపొందించింది.  

ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వంపై ఈ సర్వే కొనసాగింది. కేంద్రం పనితీరుతో 66శాతం మంది ప్రజలు సంతోషంగా ఉన్నామని చెప్పడం గమనార్హం. మరో 30శాతం మంది తాము సంతోషంగా లేమని చెప్పగా.. 4 శాతం మంది అసలు సమాధానమే చెప్పలేదు.

ఇప్పటికప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే.. 58 శాతం మంది ప్రజలు ఎన్డీఏకు మద్దతుగా నిలవగా.. 28శాతం యూపీఏకు మద్దతుగా నిలిచారు.55 శాతం మంది ప్రధాని పదవికి మోదీని ఎంచుకోగా, రాహుల్‌ను 11 శాతం మంది, మమతను 1శాతం, కేజ్రీవాల్‌ను 5, మాయావతి 1 శాతం, ప్రియాంకాను 1 శాతం మంది ఎంచుకున్నారు. వేరే నేతలను ఎంచుకుంటామని 12 శాతం మంది చెప్పారు.

బెస్ట్‌ సీఎంలు వీరే
1) నవీన్‌ పట్నాయక్‌ – ఒడిశా
2) అరవింద్‌ కేజ్రీవాల్‌ – ఢిల్లీ
3) వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి – ఆంధ్రప్రదేశ్‌
4) పినరయి విజయన్‌ – కేరళ
5) ఉద్ధవ్‌ ఠాక్రే – మహారాష్ట్ర
6) భూపేశ్‌ బఘేల్‌ – ఛత్తీస్‌గఢ్‌
7) మమతా బెనర్జీ – పశ్చిమబెంగాల్‌
8) శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ – మధ్య ప్రదేశ్‌
9) ప్రమోద్‌ సావంత్‌ – గోవా
10) విజయ్‌ రూపానీ – గుజరాత్‌