ABP-CVoter ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: గుజరాత్‌లో మళ్లీసారి అధికారం చేపట్టనున్న బీజేపీ. కానీ..,
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. ABP-CVoter ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో, భారతీయ జనతా పార్టీ మరోసారి గుజరాత్‌లో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సర్వే ప్రకారం.. బిజెపికి పోలైన ఓట్లలో 49.4 శాతం వస్తాయని అంచనా వేయబడింది. ఇది 2017 గుజరాత్ ఎన్నికలలో వచ్చిన దానికంటే 0.4 శాతం తక్కువ.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఫలితం వస్తుందోనన్న ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెలువడనప్పటికీ.. గుజరాత్‌లో తదుపరి ప్రభుత్వాన్ని ఏ పార్టీ ఏర్పాటు చేయబోతున్నాయనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.ఇదిలావుండగా.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏబీపీ సీ-వోటర్ ఎగ్జిట్ పోల్ వెలువడింది. ఈ సర్వే కూడా మరోసారి గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నదని వెల్లడించింది.
బీజేపీకి 48 శాతం ఓట్లు
ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. దక్షిణ గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీకి 48 శాతం, కాంగ్రెస్‌కు 23 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ షేర్ పరంగా విపరీతమైన ఆధిక్యాన్ని పొందుతుందనీ, దాదాపు 27 శాతం ఓట్ షేర్‌ను పొందగలదనీ, 2 శాతం ఓట్లు ఇతర పార్టీల ఖాతాలోకి వెళ్లొచ్చని సర్వే వెల్లడించింది.
దక్షిణ గుజరాత్‌లో బీజేపీ ముందంజ
ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం దక్షిణ గుజరాత్‌లో భాజపా భారీ ఆధిక్యతతో 24 నుంచి 28 స్థానాలను తన ఖాతాలో వేసుకునేలా కనిపిస్తోందని తెలిపింది. మరోవైపు కాంగ్రెస్‌కు 4 నుంచి 8 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 1 నుంచి 3 సీట్లు రావచ్చని తెలిపింది. 0 నుంచి 2 సీట్లు ఇతర పార్టీల ఖాతాలోకి వెళ్లొచ్చని వెల్లడించింది.
ఉత్తర గుజరాత్‌లోనూ బీజేపీ ముందంజ
ఉత్తర గుజరాత్‌లో బీజేపీ అధిక్యం కనబరుస్తుందని తెలిపింది. ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం.. ఉత్తర గుజరాత్‌లో బీజేపీకి 45 నుంచి 53 సీట్లు వస్తాయని తెలింది. కాంగ్రెస్‌కు 10 నుంచి 18 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 1 నుంచి 4 సీట్లు రావచ్చు. ఇతర పార్టీలకు 0 నుంచి 4 సీట్లు వస్తాయని తెలిపింది.
గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఫలితం వస్తుందోనన్న ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. 27 ఏళ్లుగా గుజరాత్ బీజేపీకి కంచుకోటగా ఉంది. ఇక, మొదటి విడతలో డిసెంబర్ 1న 89 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ దశలో సౌరాష్ట్ర, కచ్, రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరిగింది.
ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో సహా మొత్తం 39 రాజకీయ పార్టీలు అభ్యర్థులను నిలిపాయి. 89 అసెంబ్లీ స్థానాల బరిలో మొత్తం 788 మంది అభ్యర్థులు నిలిచారు. మొదటి దశలో మొత్తం ఓటింగ్ శాతం 63.14గా నమోదు కాగా.. రెండో దశ మొత్తం ఓటింగ్ శాతం 59 శాతం నమోదు అయిందని ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంలో మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 92 సీట్లు అవసరం.