హైదరాబాద్: జనసేన కార్యకర్తలకు అంటే, జనసైనికులకు చెందిన దాదాపు 300 ట్విట్టర్ ఖాతాలు సస్పెన్షన్ కు గురయ్యాయి. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనై ఉంటుందని జనసైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఇది జరిగింది.

తెలంగాణలవోని నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తున్నందుకే వాటిని సస్పెండ్ చేశారని విమర్శిస్తున్నారు. అధికారిక సోషల్ మిడియా ఖాతా శతగ్ని టీమ్ ఖాతాను కూడా సస్పెండ్ చేశారు.

తమ ట్విట్టర్ హ్యాండిల్ లో దుర్భాషలు గానీ, అసభ్యకరమైనవి గానీ షేర్ చేయలేదని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలపై నిర్మాణాత్మక విమర్శలు చేసినందుకే ఆ పనిచేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

జనసేనకు సంబంధించి 400 నుంచి 500 వరకు ట్విట్టర్ హ్యాండిల్స్ ఉన్నాయి. వాటిలో దాదాపు 300 ట్విట్టర్ హ్యాండిల్స్ ప్రస్తుతం పనిచేయడం లేదు. ప్లాట్ ఫామ్ వాయిలేషన్, స్పామ్ కారణంగా ట్విట్టర్ హ్యాండిల్స్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ట్విట్టర్ ఖాతాదారులకు ట్విట్టర్ నుంచి ఈమెయిల్స్ వచ్చాయి. 

బహుళ ఖాతాల ద్వారా, ఫేక్ అకౌంట్ల ద్వారా కృత్రిమంగా సంభాషణలను ప్రభావితం చేయడం వల్ల, ఆటోమేషన్, స్క్రిప్టింగ్ వంటి చర్యల కారణంగా ఖాతాలు సస్పెండ్ అవుతాయని ట్విట్టర్ తెలియజేసింది. అదే ప్రయోజనం కోసం కొత్త ఖాతాలు తెరిచినా కూడా సస్పెన్షన్ కు గురవుతాయని తెలిపింది. 

సస్పెన్షన్ కు గురైన ట్విట్టర్ ఖాతాలనన్నింటినీ విశ్లేషించినట్లు, తెలంగాణలోని నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై కేంద్ర ప్రణాళిక గురించే వాటిలో ట్వీట్ చేసినట్లు తేలిందని వివరించింది. 

అయితే, జనసేనకు చెందిన ట్విట్టర్ ట్వీట్లకు పెద్ద యెత్తున మద్దతు లభిస్తుండడం వల్లనే తమ ఖాతాలపై కుట్ర జరిగిందని జనసేన నేతలు విమర్శిస్తున్నారు.