పాకిస్తాన్ చెర నుంచి స్వదేశానికి చేరుకున్న ఇండియన్ ఎయిర్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం కుదుటపడగానే.. ఐఏఎఫ్ కంబాట్ పైలట్‌గా బాధ్యతలు చేపడతారని భారత వాయుసేన (ఐఏఎఫ్‌) చీఫ్‌ బీఎస్‌ ధనోవా తెలిపారు. ఫైలట్‌ ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయంలో రెండో ఆలోచన లేదన్నారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నపుడే అభినందన్‌ని విధుల్లోకి తీసుకోవటం జరుగుతుందని తేల్చిచెప్పారు.

పాక్ నుంచి వచ్చిన ఆయనకు అధికారులు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇటీవల... పాక్ స్థావరాలపై భారత ఆర్మీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభినందన్‌ వర్ధమాన్‌ ఆర్‌-73 అనే మిస్సైల్‌ ప్రయోగించి ఓ యుద్ధవిమానాన్ని కూల్చేశారు.

 అదే సమయంలో అభినందన్‌ విమానం కూడా ప్రత్యర్థి దాడిలో నేలకూలింది. దాంతో ఆయన ప్యారాచూట్‌ సాయంతో పాక్‌ భూభాగంలో దిగాల్సి వచ్చింది. అప్పుడు కొందరు పాకిస్తాన్‌ ప్రజలు ఆయనపై దాడి చేశారు. 

ఆ తర్వాత అతనిని పాక్ ఆర్మీ యుద్ధ ఖైదీగా చేసి వారి వెంట తీసుకువెళ్లింది. పాక్-భారత్ చర్చల అనంతరం అభినందన్ ని స్వదేశానికి తిరిగి పంపించారు.