ఏబీజీ షిప్‌యార్డ్ బ్యాంకు ఫ్రాడ్ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇది మన దేశంలోని భారీ బ్యాంక్ ఫ్రాడ్. సీబీఐ ఈ ఫ్రాడ్ గురించి సంచలన ప్రకటన చేసింది. ఈ మోసం యూపీఏ హయాంలోనే మొదలైందని, ఈ ఫ్రాడ్‌లో ప్రధానభాగం యూపీఏ హయాంలోనే జరిగిందని వివరించింది.
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) మంగళవారం సంచలన విషయాలను వెల్లడించింది. మన దేశంలోనే భారీ బ్యాంక్ ఫ్రాడ్(Bank Fraud)గా చెబుతున్న ఏబీజీ షిప్‌యార్డ్(ABG Shipyard) మోసం గురించి కీలక విషయాలను వివరించింది. మోసం ఇప్పుడు బయటపడ్డా.. మెజార్టీ మోసం కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ(UPA) హయాంలోనే మొదలైందని తెలిపింది. అంతేకాదు, ఈ మోసంలో ప్రధాన భాగం యూపీఏ హయాంలోనే జరిగిందని పేర్కొంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే అంటే 2013లోనే ఏబీజీ షిప్‌యార్డ్ అప్పులను నిరర్దక ఆస్తులుగా ప్రకటించినట్టు సీబీఐ తెలిపింది.
2013 నవంబర్ 30వ తేదీన ఏబీజీ షిప్‌యార్డ్ అకౌంట్‌ను నాన పర్ఫార్మింగ్ అసెంట్(NPA)గా ప్రకటించారని సీబీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా, ఈ ఫ్రాడ్‌లో ప్రధాన భాగం 2005 నుంచి 2012 మధ్య కాలంలోనే జరిగిందని తెలిపింది. ఈ సంస్థ మొత్తం 28 బ్యాంకుల్లో రూ. 22,842 కోట్లను ఫ్రాడ్ చేసినట్టు పేర్కొంది. ఏబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఈ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని దానికి సంబంధించిన పార్టీలకు బదిలీ చేసిందని తెలిపింది. అంతేకాదు, ఈ సంస్థకు చెందిన విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టూ పేర్కొంది. అంటే.. ఈ బ్యాంకుల్లోని లోన్లను దారి మళ్లించి విదేశాల్లోని ఆ సంస్థ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిందని వివరించింది. ఈ మొత్తం మోసంలో 2005 నుంచి 2012 మధ్య కాలమే ప్రధానమైనదని తెలిపింది.
ఏబీజీ షిప్‌యార్డ్ మోసంలో బీజేపీ హస్తం కూడా ఉన్నదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన తర్వాతి రోజే సీబీఐ ఈ ప్రకటన వెల్లడించడం గమనార్హం. 2018లోనే తాము ఈ ఫ్రాడ్ గురించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించామని ఆరోపించింది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థపై చర్యలు తీసుకోవడానికి మూడేళ్లు పట్టిందని పేర్కొంది. అంతేకాదు, నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే ఏబీజీ షిప్‌యార్డ్‌కు భారీగా భూములను ఈ సంస్థకు కేటాయించారని ఆరోపించింది.
సీబీఐ ప్రకటన ప్రకారం, ఏబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్.. ఎస్‌బీఐతో 2001 నుంచే సంబంధంలో ఉన్నది. అయితే, బ్యాంకు నుంచి పెద్దమొత్తంలో డబ్బు 2005 నుంచి 2012 మధ్యే జరిగాయి. ఎన్‌వీ దండ్ అండ్ అసోసియేట్స్ ఏబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో స్టాక్ ఆడిట్ చేయడానికి డిప్యూట్ చేశారు. ఈ ఆడిట్ రిపోర్టు 2016 ఏప్రిల్ 30వ తేదీన సమర్పించారు. ఆ ఆడిట్‌లో అనేక లోపాలు, తప్పిదాలు ఉన్నట్టు గుర్తించారు. ఆ రిపోర్ట్ తర్వాతే 2016 జులై 30న ఎన్‌పీఏలుగా ప్రకటించారు. 2013 నవంబర్ 30 నుంచి దానికి ఇచ్చిన లోన్లను ఎన్‌పీఏలుగా ప్రకటించారు.
ఆ తర్వాత ఫోరెన్సిక్ ఆడిట్ ప్రారంభం అయింది. సాధారణంగా ఫోరెన్సిక్ ఆడిట్లు ఎన్‌పీఏ ప్రకటించడానికి ముందు సుమారు మూడు నుంచి నాలుగు ఏళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. ఏబీజీ షిప్‌యార్డ్ కేసులో ఫోరెన్సిక్ ఆడిట్ 2016లో ప్రారంభం అయింది. 2012 నుంచి 2017 కాలంలోని లావాదేవీలను, ఖాతాలను ఆడిట్ చేసింది. అదే సమయంలో ఈ వివాదం ఎన్‌సీఎల్‌టీకి చేరింది.
2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి మధ్యలో కన్సార్టియంలోని అన్ని బ్యాంకులు ఏబీజీ షిప్‌యార్డు అకౌంట్‌ను ఫ్రాడ్‌గా ప్రకటించాయి.
