Asianet News TeluguAsianet News Telugu

Arvind Kejriwal: గుజరాత్ బీజేపీకి ఆప్ భయం పట్టుకోంది.. : కేజ్రీవాల్

Free electricity: గుజరాత్ ప్రజలకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న ఆమ్ ఆద్మీ ఆఫర్ బీజేపీని కలవరపెడుతోందని ఆప్ ఆధినేత, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అలాగే, ఉచిత కరెంటు ఇవ్వాలంటే అవినీతిని అంతమొందించాల్సిందేనన్నారు.
 

AAPs offer to give free electricity to people of Gujarat troubling BJP;says Arvind Kejriwal
Author
Hyderabad, First Published May 27, 2022, 7:53 PM IST

Gujarat: ప్ర‌ధాని నరేంద్ర మోడీ స్వ‌రాష్ట్రమైన గుజ‌రాత్ లో అప్పుడే ఎన్నిక‌ల హ‌డావిడి క‌నిపిస్తోంది. రాష్ట్రంలో అన్ని ప్ర‌ధాని పార్టీలు త్వ‌రలో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మెరుగైన ఫ‌లితాలు రాబ‌ట్టాల‌ని చూస్తున్నాయి. దీని కోసం ఇప్ప‌టి నుంచే ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లు, వ్యూహ‌ర‌చ‌న‌లు చేస్తూ ముందుకు సాగుతున్నాయి. అయితే, ఈ సారి ఎన్నిక‌ల్లో జ‌య‌కేత‌నం ఎగుర‌వేసి అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని ఆమ్ ఆద్మీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇదివ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో పంజాబ్ లో తిరుగులేని విజ‌యం సాధించి అధికారం ద‌క్కించుకున్న జోష్ ఆప్ శ్రేణుల్లో క‌నిపిస్తోంది. ఇదే జోష్ ను గుజ‌రాత్ లోనూ కొన‌సాగించాల‌ని చూస్తోంది. 

ఈ క్ర‌మంలోనే గుజరాత్ ప్రజలకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న ఆమ్ ఆద్మీ ఆఫర్ బీజేపీని కలవరపెడుతోందని ఆప్ ఆధినేత, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అలాగే, ఉచిత కరెంటు ఇవ్వాలంటే అవినీతిని అంతమొందించాల్సిందేనన్నారు. రాష్ట్ర అధికార పార్టీ బీజేపీపై తీవ్ర స్థాయిలో ఆయ‌న విమ‌ర్శ‌లుగుప్పించారు. గుజ‌రాత్ లో మంత్రులు ఉచిత విద్యుత్ ప్ర‌యోజ‌నాలు పొందుతున్నారు. రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఉచిత విద్యుత్ అందాల‌ని కేజ్రీవాల్ అన్నారు.  రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి తాము అధికారం చేప‌డితే ప్ర‌జ‌ల‌కు ఉచిత విద్యుత్ అందిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ ఉచిత విద్యుత్ ఆఫ‌ర్.. కాషాయ పార్టీని ఎందుకు ఇబ్బందులు కలిగిస్తోందో తెలుసుకోవాలన్నారు. 

అంత‌కు ముందు గుజ‌రాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ రాష్ట్రంలోని ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. కొందరు రాజకీయ నాయకులు ఉచిత హామీలు గుప్పిస్తున్నార‌నీ, వారి ఆఫ‌ర్ల ద్వారా ప్ర‌జ‌లు ప్ర‌భావితం కాకుండా ఉండాల‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఆయా పార్టీల నాయ‌కులు చేస్తున్న ఉచిత ఆఫ‌ర్లు ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు మంచిదికాద‌నీ, ఉచితాలు రాష్ట్రాన్ని నాశ‌నం చేస్తాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. సూరత్‌లో సౌత్ గుజరాత్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో పాటిల్ ప్రసంగిస్తూ పై వ్యాఖ్య‌లు చేశారు. అయితే, ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేసిన ఒక రోజు త‌ర్వాత బీజేపీని టార్గెట్ చేస్తూ కేజ్రీవాల్ విమ‌ర్శ‌లు గుప్పించ‌డం గ‌మ‌నార్హం. 

గుజ‌రాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ వ్యాఖ్య‌ల‌కు కౌంటర్ ఇచ్చిన ఆప్ అధినేత కేజ్రీవాల్..  "పాటిల్ సాహిబ్, మీ మంత్రులకు ఉచిత విద్యుత్ అందుతోంది, అది సరియైనదా? నేను ప్రజలకు ఉచిత విద్యుత్ అందిస్తే మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు" అని మీడియా కథనాలపై స్పందిస్తూ కేజ్రీవాల్ హిందీలో ట్వీట్ చేశారు. "గుజరాత్ ప్రభుత్వంలో భారీ అవినీతి జ‌రుగుతోంది. ఢిల్లీ, పంజాబ్ మాదిరిగా అవినీతిని అంతం చేయండి.. ప్రజలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం ద్వారా చాలా డబ్బు ఆదా అవుతుంది" అని అన్నారు.  కాగా, గుజరాత్ శాసనసభలో 182 మంది సభ్యులను ఎన్నుకునేందుకు డిసెంబర్ 2022లో గుజరాత్‌లో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు ప్రధాన పోటీదారులుగా ఉండగా, పశ్చిమ రాష్ట్రంలో ఆప్ కూడా ఈసారి భారీ అంచ‌నాల‌తో ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోంది. కాంగ్రెస్‌, బీజేపీల‌కు షాకిస్తూ.. అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని చూస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios