న్యూఢిల్లీ : మాజీ క్రికెటర్‌, తూర్పు ఢిల్లీ బీజేపీ అభ్యర్థి గౌతమ్‌ గంభీర్‌ పై ఆప్ అభ్యర్థి కీలక ఆరోపణలు చేశారు. తనపై అసభ్య పదజాలంతో కరపత్రాలు ముద్రించి పంచుతున్నారంటూ తూర్పు ఢిల్లీ ఆప్ అభ్యర్థి అతిషి ఆరోపించారు. 

గురువారం పార్టీ ఆప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ కరపత్రాన్ని చదువుతూ బోరున విలపించారు. కరపత్రాలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌతం గంభీర్ ఇంతలా దిగజారతారని తాను ఊహించలేదన్నారు. 

ఆప్ ఆరోపణలు, కరపత్రాల పంపిణీపై గౌతం గంభీర్ వివరణ ఇచ్చారు. కరపత్రాలను తాను ముద్రించి పంపిణీ చెయ్యలేదని స్పష్టం చేశారు. కరపత్రాల ఆరోపణలు నిరూపిస్తే తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటానని, తప్పని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అంటూ కేజ్రీవాల్ కు సవాల్ విసిరారు. 

అంతేకాదు అతిషి, కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ లకు గౌతం గంభీర్ పరువునష్టం దావా నోటీసులు పంపించారు. ఇకపోతే గౌతం గంభీర్ పై కేసు నమోదు చేయాలని తూర్పు ఢిల్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి డీసీపీని ఆదేశించారు. మెుత్తానికి కరపత్రాల రగడ అటు బీజేపీ ఇటు ఆప్ లో కలకలం రేపుతున్నాయి.