ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్టు చేసింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంటితోపాటు ఐదు ప్రాంతాల్లో ఏసీబీ దాడులు నిర్వహించింది.
దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్టు చేసింది. అవినీతి నిరోధక శాఖ ఢిల్లీలోని ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంటితోపాటు ఐదు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో భారీమొత్తంలో నగదు, ఆస్తి పత్రాలతో పాటు పలు లైసెన్స్ లేని ఆయుధాన్ని స్వాధీనం చేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఉద్యోగాల భర్తీలో అవకతవకలపై ఏసీబీ విచారణ జరుపుతోంది. రెండేళ్ల నాటి అవినీతి కేసులో విచారణ నిమిత్తం ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు ఏసీబీ గురువారం నోటీసులు జారీ చేసింది. 2020లో అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసులో ఎమ్మెల్యే ఖాన్‌ను శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు విచారణకు రావాలని పిలిచింది. పలు గంటల పాటు ఆయనను ఏసీబీ విచారించింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఖాన్ నోటీసుపై ట్వీట్ చేశారు. కొత్త వక్ఫ్ బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేసినందున తనకు సమన్లు పంపినట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. మరోవైపు ఎమ్మెల్యే ఖాన్‌తో పాటు అతని అనుచరులు ఇళ్లపై, ఇతర ప్రాంతాలపై శుక్రవారం దాడులు నిర్వహించినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారి తెలిపారు. ఈ కేసులో ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, ఆయన వ్యాపార భాగస్వామి హమీద్ అలీ ఖాన్ మసూద్ ఉస్మాన్ నివాసంతో పాటు, పలు ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ దాడులు చేసిందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. అతని ఇద్దరు సహచరుల నుంచి 24 లక్షల నగదు, 2 అక్రమ ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనుచరుడు హమీద్ అలీ ఖాన్ నివాసం నుంచి రూ.12 లక్షల డబ్బు, డబ్బులు లెక్కించే యంత్రం, అక్రమంగా కలిగి ఉన్న ఒక పిస్టల్, నాలుగు బులెట్లను స్వాధీనం చేసుకున్నారని అధికారులు తెలిపారు..
మరోవైపు ఓఖ్లా ఎమ్మెల్యే అయిన అమానతుల్లా ఖాన్ ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్నారు. ఏసీబీ సమన్లు జారీ చేసిన విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు. కొత్త వక్ఫ్ బోర్డు కార్యాలయాన్ని నిర్మించినందున తనకు సమన్లు అందాయని అందులో పేర్కొన్నారు
