Asianet News TeluguAsianet News Telugu

‘హిందూ దేవుళ్లను పూజించను’.. బౌద్ధ కార్యక్రమంలో ఆప్ మంత్రి ప్రతిజ్ఞ.. వివాదం రేపిన వీడియో

ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్య ఢిల్లీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ వీడియో కొత్త వివాదాన్ని రేపింది. సుమారు ఏడు వేల మంది బౌద్ధాన్ని స్వీకరిస్తూ హిందూ దేవుళ్లను పూజించబోమనే ప్రతిజ్ఞ చేస్తున్న సమయంలో ఆప్ మంత్రి కూడా ప్రతిజ్ఞ చేశారు. ఈ వీడియో ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య వివాదాన్ని రాజేసింది.

aap minister took oath as he will not worship hindu gods, video stirs controversy between AAP and BJP
Author
First Published Oct 7, 2022, 3:31 PM IST

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్య మరో కొత్త వివాదం రాజుకుంది. ఆప్ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్‌కు చెందిన ఓ వీడియో ఈ వివాదానికి కేంద్రంగా ఉన్నది. సామూహికంగా మత మార్పిడి చేస్తున్న కార్యక్రమంలో ఆప్ మంత్రి పాల్గొన్నారు. హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేస్తూ బౌద్ధాన్ని స్వీకరిస్తున్న సమూహం ఆ వీడియోలో కనిపిస్తున్నది. అందులో వారితోపాటు ఆప్ మంత్రి రాజేంద్ర పాల్ కూడా ప్రతిజ్ఞ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆప్ వర్సెస్ బీజేపీ వ్యాఖ్యలకు కారణమైంది.

1956 అక్టోబర్ 5వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లక్షల మంది అనుచరులతో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అందులో ఆయన 22 ప్రతిజ్ఞలను తన అనుచరులతో చేయించి బౌద్ధ మతంలోకి తీసుకెళ్లారు. ఇందులో హిందూ దేవుళ్లను పూజించను అని స్పష్టంగా ఉన్నది. వారిని దేవుళ్లుగా గుర్తించబోమని, వారిని పూజించబోమనే ప్రతిజ్ఞలు ఉన్నాయి. అంబేద్కర్ తన అనుచరులతో కలిసి బౌద్ధాన్ని స్వీకరించిన అక్టోబర్ 5వ తేదీనే ధమ్మ పరివర్తన్ దిన్ అని పేర్కొంటారు. ప్రతి యేటా అక్టోబర్ 5వ తేదీన ఓ కార్యక్రమం నిర్వహిస్తుంటారు.

ఈ ప్రతిజ్ఞలో భాగంగా ఆప్ మంత్రి కూడా వేలాది మందితో కలిసి ఈ ప్రతిజ్ఞలు చేశారు. ‘నాకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరలో విశ్వాసం లేదు. వారిని పూజించను’ అని మంత్రి అనడం వీడియోలో వినిపిస్తున్నది.

ఈ వీడియోను బీజేపీ ఢిల్లీ విభాగం ట్విట్టర్‌లో పోస్టు చేసి ఆప్ పై విరుచుకుపడింది. ఇందుకు సదరు ఆప్ మంత్రి కూడా కౌంటర్ ఇచ్చారు.

‘ఆప్ మంత్రులు అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మంత్రిని వెంటనే పార్టీ నుంచి తొలగించాలి. ఆయనకు వ్యతిరేకంగా మేం ఫిర్యాదు ఇస్తున్నాం’ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ పేర్కొన్నారు.

‘కేజ్రీవాల్ మంత్రి హిందువులకు వ్యతిరేకంగా ఎలా విషం కక్కుతున్నారో చూడండి. ఎన్నికలకు హిందువుల అవతారమెత్తే కేజ్రీవాల్, ఆప్ నేతల హిందూ వ్యతిరేక ముఖం బట్టబయలైంది. హిందూ వ్యతిరేక ఆప్‌కు ప్రజలు గట్టి సమాధానం చెబుతారు. కేజ్రీవాల్ సిగ్గుపడాలి’ అని బీజేపీ ఢిల్లీ ట్వీట్ చేసింది.

ఢిల్లీ సోషల్ వెల్ఫేర్ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ ఈ విమర్శలను తిప్పికొట్టారు. ‘బీజేపీ దేశ వ్యతిరేకి. నేను బౌద్ధ మతాన్ని విశ్వసిస్తాను. దీనితో ఎవరికైనా ఎందుకు సమస్య? వారు ఫిర్యాదు చేసుకోనివ్వండి. ఏ మతాన్ని అయినా స్వీకరించే స్వేచ్ఛ మనకు రాజ్యాంగం ఇస్తున్నది. ఆప్ అంటే బీజేపీ భయపడుతున్నది. వాళ్లు కేవలం మాకు వ్యతిరేకంగా నకిలీ కేసులు మాత్రమే పెట్టగలరు’ అని పేర్కొన్నారు.

హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా ఆప్ మంత్రులు ప్రతిజ్ఞలు చేస్తున్నప్పుడు ఎన్నికల వేళ అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు దేవలయాలు సందర్శిస్తారని ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా ప్రశ్నించారు. మరోసారి హిందూ వ్యతిరేక ఆప్ ముఖం బయటపడిందని అన్నారు.

దీనికీ ఆప్ మంత్రి సమాధానం ఇచ్చారు. బుద్ధిజంలో నాకు నమ్మకం ఉన్నదని, ఒక మతాన్ని కచ్చితంగా అవలంభించాలని ఎవరూ బలవంతపెట్టలేరు అని పేర్కొన్నారు. ‘కులం ఆధారంగా రాజకీయాలు చేసే వారు ద్రోహులు. వారికి మరే ఇతర అజెండా ఉండదు. ఒక మతంపై వారికి ప్రత్యేక హక్కులు ఉన్నాయని వారు భావిస్తారు. ఆప్ వర్కర్లు ఎందుకు ఆలయాలకు వెళతారని వారు అడుగుతున్నారు. వాళ్లకు ఆ మతంలో నమ్మకం ఉన్నది కాబట్టి వెళతారు. నాకు బుద్ధిజంలో నమ్మకం ఉన్నది. నేను అక్కడికి వెళతాను. అంతేకానీ, ప్రత్యేకించిన ఒక మతాన్నే అనుసరించాలని నన్ను ఎవరు బలవంతం చేయజాలరు’ అని గౌతమ్ దీటైన జవాబు ఇచ్చారు.

ఈ కార్యక్రమాన్ని జై భీమ్ మిషన్ అనే సంస్థ నిర్వహించింది. ఇందులో సుమారు ఏడు వేల మంది (అందులో ప్రధానంగా దళితులు) బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ అంబేద్కర్ ముని మనవడు రాజ‌రత్న అంబేద్కర్ కూడా హాజరయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios