ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించిన ఓ వీడియోను మార్పులు చేసి ఢిల్లీ బీజేపీ ప్రతినిధి నవీన్ కుమార్ జిందాల్ ట్విట్టర్‌లో షేర్ చేశారని ఆరోపిస్తూ పంజాబ్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆప్ అధికారంలోని ఈ రాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత బీజేపీ నేత నవీన్ కుమార్ జిందాల్ నివాసానికి అరెస్టు చేయడానికి చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోం శాఖ పరిధిలో ఉంటారన్న సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం. అక్కడ పోలీసులు కేంద్ర హోం శాఖ పరిధిలో ఉంటాయి. ఢిల్లీ పోలీసులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు నియంత్రణ స్వల్పమే. అందుకే అక్కడ జేఎన్‌యూలో హింస అయినా.. ఇతర అనేక ఘటనలపైనా ఆయన ఘాటుగా స్పందిస్తూ వచ్చినా పోలీసుల బలగాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేకున్నారు. కానీ, పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఈ లోపాన్ని పూడ్చుకునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తున్నది. పంజాబ్ పోలీసులనూ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ వాడుకోవాలని భావిస్తున్నారా? ప్రత్యర్థి పార్టీలపై ముఖ్యంగా కేంద్రంలో అధికారంలోని బీజేపీ నేతలపట్ల కఠినంగా వ్యవహరించడానికి ఆయన తన పార్టీ అధికారంలోని పంజాబ్ నుంచి పోలీసు బలగాలను వినియోగించుకోనున్నారా? అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నది. ఢిల్లీలో బీజేపీ ప్రతినిధి నవీన్ కుమార్ జిందాల్ నివాసానికి పంజాబ్ పోలీసులు రావడంతో ఈ చర్చ మొదలైంది.
ఢిల్లీ బీజేపీ స్పోక్స్‌పర్సన్ నవీన్ కుమార జిందాల్ ఇటీవలే అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అది ఫేక్ వీడియో అని ఆమ్ ఆద్మీ పార్టీ వాదిస్తున్నది. అరవింద్ కేజ్రీవాల్ ఇంటర్యూను వక్రీకరించి.. సరిగా చెప్పాలంటే ఆ వీడియోకు మార్పు చేర్పులు చేసి కొన్ని మాటలను ఎగరగొట్టి తప్పుడు అర్థం వచ్చేలా చేసి ఆ వీడియోను వైరల్ చేస్తున్నారనేది ఆప్ ఆరోపణ. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన బీజేపీ నేత నవీన్ కుమార్ జిందాల్‌పై పంజాబ్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో పంజాబ్ పోలీసులు ఢిల్లీలోని బీజేపీ ప్రతినిధి నవీన్ కుమార్ జిందాల్ నివాసానికి వచ్చారు.
పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయవాది ఫిర్యాదుతో పంజాబ్ పోలీసులు మొహలీలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ నేత నవీన్ కుమార్ జిందాల్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన వక్రీకరించిన వీడియో క్లిప్‌ను షేర్ చేశారని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలోని కొన్ని మాటలను మాత్రమే తీసుకుని తప్పుడు అర్థం వచ్చేలా వీడియోను మార్పులు చేర్పులు చేశారని ఆరోపించారు. వాస్తవంగా ఆయన ఉద్దేశాలను వెల్లడిస్తూ మాట్లాడిన మాటలకు, ఆ వీడియో క్లిప్‌లోని మాటలకు మధ్య పొంతన లేదని పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఆ ఇంటర్వ్యూలో స్వచ్ఛమైన, పారదర్శకమైన ప్రభుత్వాన్ని తేవడంపై చేస్తున్న వ్యాఖ్యలను ఈ వీడియో క్లిప్‌లో వక్రీకరించారని ఆరోపించారు.
ఆ పోలీసుల ఫొటోలను షేర్ చేస్తూ బీజేపీ నేత నవీన్ కుమార్ జిందాల్ ఓ ట్వీట్ చేశారు. నన్ను అరెస్టు చేయించడానికి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ నుంచి ఓ ప్రైవేట్ కారులో పోలీసులను ఇక్కడకు రప్పించారని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. కానీ, తాను ఈ బెదిరింపులకు భయపడే వాడిని కాదని స్పష్టం చేశారు. తాను సత్యం వెల్లడించకుండా ఆగిపోయేది లేదని వివరించారు.
117 మంది సభ్యుల అసెంబ్లీలో ఆప్ 92 స్థానాలను కైవసం చేసుకుని ఎన్నికలలో భారీ విజయాన్ని సాధించింది. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి అభ్యర్థి భగవంత్ మాన్ సింగ్ ధురి స్థానం నుండి 58,000 ఓట్ల తేడాతో గెలుపొందారు.
