పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. పంజాబ్‌లో పరిస్థితులు అనుకూలంగా మారుతున్న క్రమంలోనే ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీని విస్తరించాలని ఆప్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆ పార్టీ ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 2023లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేయడానికి సిద్ధం అయింది.
కోల్‌కతా: ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. తొలిసారి పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ ఇతర రాష్ట్రాలకు విస్తరించే ఆలోచనలు చేస్తున్నది. అంతేకాదు, ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ పార్టీ అధికారంలోని పశ్చిమ బెంగాల్‌లోకీ ఆప్ ప్రవేశించింది. అక్కడా తన అదృష్టాన్ని చూసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. 2023లో పశ్చిమ బెంగాల్‌లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నది. ఈ మేరకు పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వెళ్లాయి.
పశ్చిమ బెంగాల్ ఆప్ ఇంచార్జీ సంజయ్ బసు సోమవారం ఒక కీలక ప్రకటన చేశారు. పశ్చిమ బెంగాల్‌లో 2023లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని వెల్లడించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఇప్పటికే రాష్ట్రంలో క్యాంపెయిన్ ప్రారంభించామని వివరించారు. ఈ నెల 13వ తేదీన కోల్‌కతాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ మేరకు ఓ ర్యాలీని కూడా నిర్వహించిందని తెలిపారు.
అయితే, ఇక్కడ ఒక కీలక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీల మధ్య సత్సంబంధాలు ఉన్న విషయాన్ని మరువరాదు. వారిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికీ తన రాష్ట్రంలో ఆప్ పార్టీ ఎదుగుదలను అంత సులువుగా దీదీ అంగీకరిస్తుందని అనుకోలేం. బీజేపీపై విరుచుకుపడినట్టుగా ఆప్ పట్ల వ్యవహరించకపోవచ్చు. కానీ, అంతిమంగా తనను మించిపోయే అవకాశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వకపోవచ్చు.
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 92 అసెంబ్లీ స్థానాల్లో AAP విజయం సాధించింది. ఈ విజయంతో ఆప్ రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 స్థానాలను కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ దఫా ఆ పార్టీ 18 స్థానాలకే పరిమితమైంది. ఆప్ ప్రభంజనంలో ఈ దఫా ఎన్నికల్లో Congress, SAD కు చెందిన ప్రముఖులు కూడా ఘోర ఓటమిని చవి చూశారు.
మరోవైపు ఈ నెల 16న పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా భగవంత్ సింగ్ మన్ ప్రమాణ స్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ రోజు భగవంత్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మంత్రుల ప్రమాణ స్వీకారం మరో రోజు ఉంటుందని తెలుస్తోంది. స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖాట్కర్ కలాన్‌లో ఈ ప్రమాణ స్వీకారం జరగనుంది.
పంజాబ్‌కు చాలా ఏళ్ల తర్వాత నిజాయతీ గల వ్యక్తి సీఎం అవుతున్నారని వ్యాఖ్యానించారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ . ప్రజలకు నిజాయతీతో కూడిన పాలనను అందిస్తామని పంజాబ్ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆదివారం అమృత్‌సర్‌లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాబోయే సీఎం భగవంత్ మాన్‌తో కలిసి కేజ్రీవాల్ పాల్గొన్నారు.
