Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం.. కేజ్రీవాల్ ‘భవిష్యవాణి’ప్రసంగాన్ని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కేవలం 5 స్థానాలను గెలుచుకుంది. మరో సారి బీజేపీ తన సత్తా చూపించింది. అయితే ఎన్నికల ప్రచారం సమయంలో అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 

Aam Aadmi Party's massive defeat in Gujarat.. Netizens trolling Kejriwal's 'Bhavishyavani' speech
Author
First Published Dec 8, 2022, 4:15 PM IST

గుజరాత్ ఎన్నికల ఫలితాలపై స్పష్టత వచ్చింది. వరుసగా ఏడో సారి బీజేపీ అధికారం చేపట్టనుంది. కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రతిపక్షంలోనే కూర్చోనుంది.ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లే ఫలితాలన్నీ బీజేపీకే అనుకూలంగా వచ్చాయి. మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ 158 కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తీవ్రంగా దిగజరాంది. కేవలం 16 స్థానాలను గెలుచుకుంది. ఇక ఈ సారి గుజరాత్ లో అధికారం తమదే అని ధీమా వ్యక్తం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 5 స్థానాలకే పరిమితం అయ్యింది.

Aam Aadmi Party's massive defeat in Gujarat.. Netizens trolling Kejriwal's 'Bhavishyavani' speech

గుజరాత్ లో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేజ్రీవాల్ విశ్వాసం వ్యక్తం చేసినప్పటికీ.. ఆప్ తన ఉనికి చాటలేకపోయింది. ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో పర్యటించి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉచిత విద్య, ఆరోగ్య సంరక్షణకు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీలన్నీ బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకుంది. ఉచిత పథకాల వల్ల నష్టాలుంటాయని బలంగా వాదించింది. దీంతో ప్రజలు బీజేపీనే నమ్మారు. ఆ పార్టీకే మద్దతు తెలిపారు. 

కాగా.. ఎన్నికల సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన వాగ్దానాలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆయనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఆయన చెప్పిన భవిష్యవాణి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అందులో ‘‘గుజరాత్ లో డిసెంబర్ 8న చరిత్ర సృష్టిస్తామని, ఆప్ కు స్వాగతం పలికేందుకు, బీజేపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు సర్వశక్తిమంతుడు ప్రయత్నిస్తున్నారు’’అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

అలాగే ఆయా సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు, పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలను కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. ఎన్నికల తర్వాత గుజరాత్ లో ఆప్ ప్రభుత్వం ఏర్పడబోతోందని, బీజేపీ అధికారం నుంచి వైదొలగుతున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) నివేదిక ఇచ్చిందని కేజ్రీవాల్ చెబుతున్న మరో వీడియోను కూడా నెటిజన్లు షేర్ చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios