న్యూఢిల్లీ: ఆధార్‌తో సమాజంలోని అట్టడుగు వర్గాలకు గుర్తింపు కార్డు లభించిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కార్డు వల్ల  సాధికారిత లభించినట్టైందని  సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రి అన్నారు.  ఆధార్ కార్డు రాజ్యాంగబద్దమైందని ఆయన స్పష్టం చేశారు.

ఆధార్‌తో వ్యక్తిగత గోప్యతకు  భంగం కలుగుతోందని దాఖలైన పిటిషన్లపై  బుధవారం నాడు కోర్టు  విచారణ జరిపింది.ఈ పిటిషన్లపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. జస్టిస్ ఏకే సిక్రి తీర్పును చదివి విన్పించారు. 

కోర్టు అనుమతి లేకుండా బయోమెట్రిక్‌ సమాచారాన్ని ఏ ఏజెన్సీలకు ఇవ్వడానికి వీల్లేదని తెలిపింది. సుమారు బిలియన్‌ మందికి పైగా భారతీయులు ఆధార్‌ నమోదు చేసుకున్నారని కోర్టు ఈ సందర్భంగా తెలియజేసింది.

బ్యాంకు ఖాతాలు తెరవడానికి ఆధార్‌ కార్డు తప్పనిసరి కాదని నేడు సుప్రీంకోర్టు వెల్లడించింది. అలాగే మొబైల్‌ కనెక్షన్లకు కూడా అవసరం లేదని చెప్పింది. పాఠశాల అడ్మిషన్లకు, సీబీఎస్‌ఈ, నీట్‌, యూజీసీ పరీక్షలకు హాజరవ్వడానికి కూడా ఆధార్‌ తప్పనిసరి కాదని కోర్టు స్పష్టంచేసింది. ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్‌ చేయడానికి, పాన్‌ కార్డు నమోదు చేసుకోవడానికి ఆధార్‌ కార్డు తప్పకుండా ఉండాలని కోర్టు వెల్లడించింది.