ఢిల్లీలోని చాందినీ చౌక్ లో ఘోర అగ్నిప్రమాదం.. మంటలను ఆర్పుతున్న 40 ఫైర్ ఇంజన్లు..
ఢిల్లీలో మళ్లీ అగ్నిప్రమాదం జరిగింది. చాందినీ చౌక్‌లోని భగీరథ్ ప్యాలెస్ మార్కెట్‌లో గురువారం రాత్రి ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
పాత ఢిల్లీలోని చాందినీ చౌక్‌లోని భగీరథ్ ప్యాలెస్ మార్కెట్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడి దుకాణాల్లో గురువారం రాత్రి మంటలు చెలరేగాయి. అయితే ఆ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటలను ఆర్పేందుకు దాదాపు 40 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కష్టపడుతున్నారు.
గుజరాత్ ఎన్నికల బరిలో ఉన్న 788 మందిలో 167 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు..
దీనిపై ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ.. గురువారం రాత్రి 9.19 గంటలకు అగ్నిప్రమాదంపై సమాచారం అందిందని తెలిపారు. వెంటనే వాటిని అదుపు చేసేందుకు మొత్తం 40 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయని చెప్పారు. ఈ ఉదయం మంటలను అదుపులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
మంటలను ఆర్పేందుకు డిపార్ట్‌మెంట్ రిమోట్ కంట్రోల్ ఫైర్ ఫైటింగ్ మెషీన్‌ను ఉపయోగిస్తోందని అన్నారు. అయితే పరిస్థితి బాగా లేదని, భవనంలో చాలా భాగం దెబ్బతిన్నదని తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో తెలిపారు.
రెండు అంతస్తులు పూర్తిగా దెబ్బతినడంతో ప్రధాన భవనం నెమ్మదిగా కూలిపోతోందని ఘటనా స్థలాన్ని సందర్శించిన మాజీ ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలంలో ఉన్నారని, మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. “అగ్నిని ఆర్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు మంటలు అదుపులోకి రాలేదు. రెండు అంతస్తులు దెబ్బతిన్నాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు’’ అని మంత్రి తెలిపారు.