బస్సును ఢీకొన్న స్కూల్ వ్యాన్.. ముగ్గురు చిన్నారులు, డ్రైవర్ మృతి, 16 మందికి గాయాలు..
ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ స్కూల్ వ్యాన్ ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. దీంతో ఆ వ్యాన్ లో స్కూల్ కు వెళ్తున్న ముగ్గురు చిన్నారులు, అలాగే ఆ వాహనం డ్రైవర్ ఘటనా స్థలంలోనే మరణించారు. 16 మందికి గాయాలపాలయ్యారు.
ఓ బస్సు స్కూల్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు, వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు. మరో 16 మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం ఉత్తర్ ప్రదేశ్ లోని బదౌన్ జిల్లాలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
వివరాలు ఇలా ఉన్నాయి. 20 మంది పిల్లలతో ఓ వ్యాన్ ఎప్పటిలాగే సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్తోంది. ఆ వ్యాన్ బదౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉసావా ప్రాంతంలోని నవీగంజ్ సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న ఓ బస్సును ఢీకొట్టింది. దీంతో వ్యాన్ లో ఉన్న ముగ్గురు చిన్నారులు, ఆ వాహనం డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో పోలీసులు, స్థానికుల సాయంతో క్షతగాత్రులను బదౌన్ మెడికల్ కాలేజీ, జిల్లా హాస్పిటల్ కు తరలించారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న జిల్లా మేజిస్ట్రేట్, సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ బదౌన్ జిల్లా ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులైన చిన్నారులకు ప్రాధాన్య క్రమంలో చికిత్స అందించాలని వైద్యులను కోరారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించారు. కాగా.. వ్యాన్ లో ఉన్న 20 మంది చిన్నారుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో 16 మంది గాయపడ్డారని, వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. యూపీలోని బల్లియా జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. ఓ ఆటోను మరో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు, క్షతగాత్రులు పొరుగున ఉన్న మౌ జిల్లాలోని సదర్ చౌక్ కు చెందినవారని వార్తా సంస్థ ‘పీటీఐ’ వెల్లడించింది.