Rahul Gandhi: కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ మ‌రోసారి అధికార బీజేపీని విమ‌ర్శించారు. ప్ర‌ధాని మోడీని, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌)ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలని రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు. విపక్షాల ఐక్యత, దాని స్వరూపం ఎలా ఉండాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. 

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ మ‌రోసారి అధికార బీజేపీ పై విమ‌ర్శాస్త్రాల‌ను సంధించారు. ప్రధాని మోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే.. ప్రతిపక్షాలన్ని ఏకతాటిపైకి రావాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆర్జేడీ అధినేత శరద్ యాదవ్‌తో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్ర‌భుత్వంపై నిప్పులు చేరిగారు. ప్రతిపక్షాలు ఐక్యతకు సంబంధించి, దాని కార్యాచరణకు సంబంధించిన విషయాలపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.

ప్ర‌స్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ద్వేషం వ్యాప్తి చెందుతోందనీ, అధికార బీజేపీ దేశాన్ని విభజించే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని ఆరోపించారు. బీజేపీ, దాని అనుబంధ సంస్థ‌ల దాడుల‌ను ఎదుర్కొవాలంటే.. ప్రతిప‌క్షాల‌న్ని ఏకతాటిపైకి తీసుకురావాలని, మన చరిత్రలో భాగమైన సోదర బాటలో మరోసారి నడవాలని పేర్కొన్నారు. సామరస్యం లేని దేశంలో ద్వేషం పెరుగుతుందని, ద్రవ్యోల్బణం పెరుగుతుందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా సైన్యాన్ని మోహరించింది. కానీ ప్రభుత్వం దానిని విస్మరిస్తోంది అని కూడా రాహుల్ గాంధీ విమర్శించారు.

గత రెండు మూడేళ్లుగా మీడియా, సంస్థలు, బీజేపీ నేతలు, ఆర్‌ఎస్‌ఎస్‌లు నిజాలను దాచిపెడుతున్నాయ‌నీ, ఇప్పుడిప్పుడే.. మెల్లగా నిజాలు బయటపడుతున్నాయ‌ని ఆరోపించారు. రాబోయే మూడు-నాలుగేళ్లలో భయంకరమైన ఫలితాలు వస్తాయని రాహుల్ గాంధీ హెచ్చరించారు. 
ప్ర‌స్తుతం శ్రీలంకలో అదే జరుగుతుందో.. అంద‌రికీ తెలుసున‌నీ, రాబోయే రోజుల్లో భార‌త్ కూడా అలాంటి ప‌రిస్థితులు వ‌స్తాయ‌ని విమ‌ర్శించారు. 

ఇప్పుడే.. దేశ ప‌రిస్థితిపై ఆర్థికవేత్తలు, బ్యూరోక్రాట్లను క‌లిసి.. ఈ పరిస్థితిపై చ‌ర్చించాల‌ని ప్రధాని మోడీకి సూచించారు. అదే విధంగా శరద్ యాదవ్ చాలాకాలం అనారోగ్యంతో ఉన్నారని, అతను ఇప్పుడు ఫిట్‌గా పోరాడుతున్నందుకు సంతోషంగా ఉందని రాహుల్ అన్నారు. ఆయన తనకు రాజకీయాల గురించి చాలా నేర్పించారని చెప్పారు. శరద్ యాదవ్‌ను తన గురువుగా అభివర్ణించారు. అలాగే తనకు దేశం పట్ల శ్రద్ధ ఉందని, బడుగు బలహీన వర్గాల కోసం పని చేయాల్సిన అవసరం ఉందని శరద్ యాదవ్‌ కూడా అన్నారు.

రాహుల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని తాను అనుకుంటున్నానని శరద్ చెప్పారు. ఆయన అహర్నిశలు పార్టీ కోసం పనిచేస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీని ఎదుర్కోవడానికి భారతదేశం అంతటా ప్రతిపక్షాల ఐక్యత తప్పనిసరనీ, ఆర్జేడీలో శ‌ర‌ద్ ప‌వ‌ర్ పార్టీ విలీనం ఆ దిశగా తొలి అడుగని, బీజేపీని ఓడించడం పెద్ద సవాల్‌గా ఉన్నందున అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడానికి కృషి చేస్తామని రాహుల్ అన్నారు.