Asianet News TeluguAsianet News Telugu

కరోనా కొత్త వేరియంట్ కలకలం.. ఆరోగ్య అధికారులు, నిపుణులతో పీఎంవో సమీక్ష

కొత్త వేరియంట్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అధికారులు, నిపుణులతో శనివారం కరోనా పరిస్థితిపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించింది. దీనికి ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా అధ్యక్షత వహించారు. 

A new variant of Corona is mixed.. PMO review with health officials and experts
Author
First Published Jan 1, 2023, 11:52 AM IST

దేశంలో కరోనా కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో దేశంలోని కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించేందుకు ఆరోగ్య అధికారులు, నిపుణులతో ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా అధ్యక్షతన శనివారం కేంద్రం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో మహమ్మారిని ఎదుర్కొనేందుకు సంసిద్ధత, సమర్థవంతమైన నిర్వహణను నిర్ధారించడానికి ప్రధాని నరేంద్ర మోడీ గతంలో జారీ చేసిన ఆదేశాలను పాటించారా లేదా అనే విషయంపై సమీక్ష జరిగింది.

చైనా, ఇతర తూర్పు ఆసియా దేశాలలో కోవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రధానమంత్రి గత వారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో విజిలెన్స్, నిఘా పెంచాలని, పరీక్షలు, జీనోమ్ సీక్వెన్సీని వేగవంతం చేయాలని ఆదేశించారు. డిసెంబర్‌లో సేకరించిన దాదాపు 500 నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ దేశవ్యాప్తంగా ఉన్న ఐఎన్ ఎస్ఏ సీవోజీ ల్యాబ్‌లలో నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. ఈ తాజా సమావేశంలో చైనాలో వేవ్ కు కారణమైన బీఎఫ్ -7తో పాటు కొత్తగా వస్తున్న వేరియంట్ లపై చర్చించారు. 

ఈ సమావేశంలో ప్రధానమంత్రి ఆదేశాల మేరకు మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ (డబ్లూ జీఎస్)ని బలోపేతం చేయడం, మరింత ముఖ్యమైన సంఖ్యలో నమూనాలను దేశవ్యాప్తంగా ఐఎన్ ఎస్ఏ సీవోజీ నెట్‌వర్క్‌కు పంపించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు తాజా ఆదేశాల నేపథ్యంలో 1,716 అంతర్జాతీయ విమానాలను పరీక్షించారు. కోవిడ్-19 పరీక్ష కోసం 5,666 నమూనాలు సేకరించారు. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో నిర్వహించిన పరీక్షల్లో దాదాపు 53 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కోవిడ్-19 ఉన్నట్టు తేలింది.

ఈ సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా మాట్లాడుతూ.. చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, బ్రెజిల్ మొదలైన కొన్ని దేశాలలో కోవిడ్ కేసుల గురించి వివరించారు. అందుకే చైనా, థాయ్‌లాండ్, జపాన్, సింగపూర్, హాంకాంగ్, దక్షిణ కొరియా నుండి వచ్చే ప్రయాణికులకు జనవరి 1 నుండి ఆర్టీ పీసీఆర్ నివేదిక అవసరమని భారతదేశం ఇప్పటికే ప్రకటించిందని తెలిపారు. 

ఈ సమావేశంలో కోవిడ్ ప్రవర్తనా నియామవళిపై అవగాహన పెంపొందించడం, నిఘాను బలోపేతం చేయడం, దేశవ్యాప్తంగా పరీక్షలను వేగవంతం చేయడం, కరోనా వైరస్ ముందు జాగ్రత్త డోసులను తీసుకోవడంపై దృష్టి సారించినట్టు చెప్పారు. ప్రధాని ఆదేశాల మేరకు డిసెంబర్ 27న అన్ని ఆరోగ్య కేంద్రాల్లో మాక్ డ్రిల్‌లు చేపట్టిన తెలిపారు. 

ఆక్సిజన్ ప్లాంట్లు, వెంటిలేటర్లు, లాజిస్టిక్స్, సిబ్బంది, ఇతర సౌకర్యాలపై సంసిద్ధతను నిర్ధారించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ కసరత్తుల్లో పాల్గొన్నాయని చెప్పారు. దేవ వ్యాప్తంగా 21,097 హాస్పిటల్స్ మాక్ డ్రిల్ నిర్వహించాయని, వాటిలో 16,108 ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయని పేర్కొన్నారు. 

కాగా.. మందులు, ఇతర పరికరాల లభ్యతను తెలుసుకునేందుకు ఫార్మా కంపెనీలతో విడివిడిగా సమీక్షా సమావేశాలు నిర్వహించిన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా.. కేంద్రం నిర్వహిస్తున్న సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో మాక్ డ్రిల్‌ను వ్యక్తిగతంగా సమీక్షించారు. అంతకు ముందు డిసెంబర్ 23న కోవిడ్-19పై రాష్ట్ర ఆరోగ్య మంత్రులతో వర్చువల్ సమీక్ష సమావేశానికి కూడా ఆయన అధ్యక్షత వహించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios