ధర్మస్థలపై ఇప్పుడు అందరి చూపు ఉంది. ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో వందలాది మహిళలను చంపి పడేసారని ఒక వ్యక్తి చెప్పాడు. అప్పటినుంచి అధికారులు అక్కడ తవ్వుతున్నారు. ఇప్పుడు అక్కడే యూట్యూబర్లపై దాడి జరిగింది.
ధర్మస్థల.. ఒక పరమ పవిత్ర పుణ్యక్షేత్రం. ఇప్పుడు అదే పుణ్యక్షేత్రం గురించి దేశవ్యాప్తంగా అనేక రకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఒకప్పటి పారిశుధ్య కార్మికుడు భీమన్న ఈ ధర్మస్థలలో తాను వందలాది మహిళల, బాలికల మృతదేహాలను ఖననం చేశానని చెప్పాడు. దాంతో ధర్మస్థలలో ఆయన చెప్పిన ప్రాంతాలలో తవ్వకాలు మొదలుపెట్టారు. కాగా ధర్మస్థలకు ఇప్పుడు టీవీ రిపోర్టర్లు, యూట్యూబర్లు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. అడవి ప్రాంతంలో తవ్వకాల గురించి, బాధితుల ఇంటర్వ్యూలు వంటివి ప్రసారం చేస్తున్నారు. అయితే బుధవారం సాయంత్రం నలుగురు యూట్యూబర్లపై దాడి చేశారు. కొంతమంది దుండగులు మైకులు, కెమెరాలు పట్టుకున్న వారిపై విచక్షణారహితంగా కొట్టారు.
ఏం జరిగిందంటే...
ప్రత్యక్ష సాక్షి చెబుతున్న ప్రకారం దాదాపు 50 నుండి 100 మంది వ్యక్తుల గుంపు రెండు మూడు ఆటోలలో వచ్చి యూట్యూబర్లపై దాడి చేసినట్టు తెలుస్తోంది. తమ వీడియోలు ద్వారా ధర్మస్థల ప్రతిష్టను దిగజారుస్తున్నారని వారు ఆరోపించారు. అలాగే వారు పెట్టే థంబ్ నెయిల్స్ తమ ప్రాంత విశిష్ఠతను తగ్గించేలా ఉన్నాయి కూడా ఆ దుండగులు అరిచినట్టు చెబుతున్నారు. వారు యూట్యూబర్లకు చెందిన వాహనాలను కూడా ధ్వంసం చేశారు. హత్యకు గురైన సౌజన్య ఇంటికి దగ్గరలోనే ఇది జరిగింది. అంతేకాదు అక్కడున్న సౌజన్య బ్యానర్లను కూడా ఆ గుంపు చించి పడేసింది. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయింది.
ఏసియానెట్ రిపోర్టర్ పైనా దాడి
యూట్యూబర్లకు గాయాలు అవడంతో కొంతమందిని ఆసుపత్రిలో చేర్చారు. కొన్ని కెమెరాలు విపరీతంగా దెబ్బతిన్నాయి. ఒకరు ఐసీయూలో ఉన్నట్లు కూడా చెబుతున్నారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ కూడా చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడి ఘటనతో ధర్మస్థలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ధర్మస్థల న్యూస్ కవరేజ్ కోసం ఏపీ, తెలంగాణ నుంచి కూడా కొంతమంది తెలుగు రిపోర్టర్లు వెళ్లారు. కానీ వారంతా సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాడి జరిగిన వారంతా తమిళనాడుకు చెందినవారేనని సమాచారం. అయితే వారిలో ఏసియానెట్ కన్నడ న్యూస్ రిపోర్టర్ హరీష్ కు కూడా గాయాలు తగిలాయి.
ఏం బయటపడ్డాయి?
ధర్మస్థల కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అక్కడ వందలాది మహిళలను, బాలికలను దారుణంగా అత్యాచారం చేశారని... తరువాత వారిని చంపి సమాధి చేశారని భీమన్న చెప్పుకొచ్చాడు. భీమన్న చెప్పిన ప్రకారం ధర్మస్థల క్షేత్రంలో ప్రత్యేక దర్యాప్తు బృందం 15 స్పాట్లను గుర్తించి అక్కడే తవ్వకాలు చేపడుతోంది. ప్రస్తుతం 12 ప్రాంతాల్లో తవ్వకాలు పూర్తయినట్టు తెలుస్తోంది. అయితే తవ్వకాలలో ఏం బయటపడ్డాయో సిట్ ధ్రువీకరించడం లేదు. వార్తలు వస్తున్న ప్రకారం కొన్నిచోట్ల పుర్రెలు, ఎముకలు బయట పడినట్టు తెలుస్తోంది. సిట్ అధికారులు బహిరంగంగా ఆ తవ్వకాల్లో ఏం బయటపడ్డాయో అధికారికంగా వివరిస్తేనే పూర్తి విషయం ప్రజలకు అర్థమవుతుంది.
13 స్పాట్ లో తవ్వకాలు
ప్రస్తుతానికి వచ్చిన సమాచారం ప్రకారం 13వ స్పాట్లోనే ఎక్కువ మందిని పూడ్చి పెట్టానని పారిశుద్ధ్య కార్మికులు భీమ సిట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. కనీసం అక్కడ 10 మృతదేహాలు ఉంటాయని చెప్పాడు. దీంతో అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి.
భీమన్న చెప్పిన ప్రకారం 1998 నుంచి 2014 మధ్య ధర్మస్థలలో అనేక మందిని తానే తన చేతులతో పూడ్చిపెట్టానని పారిశుద్ద్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే శ్రీ మంజునాథుడు కొలువైన ఆ పరమ పవిత్ర క్షేత్రంలో ఇలాంటి సంఘటనలపై వార్తలు రావడం స్థానిక ప్రజలను ఎంతో భయభ్రాంతులకు గురిచేస్తోంది.
